హైదరాబాద్ వాసులకు జలమండలి కీలక అప్డేట్ ఇచ్చింది. నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో శనివారం ఉదయం నుండి తాగునీటి సరఫరాలో అంతరాయం కలగుతుందని తెలిపింది., మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ పంప్ హౌస్‌లో అత్యవసర మరమ్మతులు, ఆధునీకరణ పనుల కారణంగా జలమండలి ఈ నిర్ణయం తీసుకుంది. పెద్దాపూర్ పంప్ హౌస్‌లో దాదాపు 35 ఏళ్ల నాటి పాతబడిన హెచ్‌టి ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 మిమీ డయా పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌ల మార్పిడి, సింగాపూర్ నుంచి పెద్దాపూర్ వరకు ఉన్న 2000 మిమీ డయా గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వెంట్స్ మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ పనులు 07.03.2026 (శనివారం) ఉదయం 8 గంటల నుంచి 08.03.2026 (ఆదివారం) రాత్రి 8 గంటల వరకు అంటే సుమారు 36 గంటల పాటు కొనసాగుతాయి.
ఈ ప్రాంతాల్లో
మరమ్మతుల కారణంగా కింద కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడం లేదా తక్కువ ప్రెజర్‌తో సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు.
O అండ్ M డివిజన్ నెం.18: మణికొండ, కోకాపేట్, నర్సింగి, మంచిరేవుల ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుంది.
O అండ్ M డివిజన్ నెం.3: షేక్‌పేట్: షేక్‌పేట్ రిజర్వాయర్‌కు నీటి సరఫరా ఉండదు. అంతేకాకుండా భోజగుట్ట ప్రాంతానికి తక్కువ ప్రెజర్‌తో నీరు సరఫరా అవుతుంది.
ట్రాన్స్మిషన్ I & II: ఈ విభాగాల పరిధిలోని ప్రాంతాలకు కూడా నీటి సరఫరా నిలిచిపోనుంది.
జలమండలి విజ్ఞప్తి
పనులు పూర్తయ్యే వరకు ఈ ప్రాంతాల ప్రజలు నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి అధికారులు కోరారు. ప్రజలు సహకరించి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.