
హైదరాబాద్ మహానగరానికి ప్రాణాధారమైన మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు సంబంధించి మొదటి దశ డీపీఆర్ పూర్తవడంతో త్వరలోనే పనులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మొదటి దశలో సుమారు 21 కిలోమీటర్ల పరిధిలో రూ.7 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మూసీ నది పరిసరాలు పూర్తిగా మారిపోతాయి. వరదలు వచ్చినా నగరానికి ఎలాంటి ప్రమాదం లేకుండా రక్షణ గోడలు, పచ్చని పార్కులు, వాణిజ్య సముదాయాలు, పర్యాటక కేంద్రాలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
- మొదటి దశలో 21 కిలోమీటర్ల అభివృద్ధిః మొదటి దశలో హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, గండిపేట నుంచి బాపూ ఘాట్ వరకు కలిపి సుమారు 21 కిలోమీటర్ల పరిధిలో మూసీ పునరుజ్జీవ పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరాలకు దీటుగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించారు.
- వరదల నుంచి రక్షణకు భారీ గోడలుః 1908లో హైదరాబాద్‌ను వణికించిన ఘోర వరదల మాదిరి పరిస్థితి మళ్లీ రాకుండా ప్రత్యేక రక్షణ గోడలను నిర్మించనున్నారు. లక్షన్నర క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా నది ఇరువైపులా భారీ నిర్మాణాలు చేపట్టాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.
- మురుగు నీరు నదిలోకి రాకుండా ట్రంక్ లైన్లుః మూసీ నదిలోకి మురుగు నీరు చేరకుండా భారీ ట్రంక్ లైన్ పైపులైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పైపులను మురుగు నీటి శుద్ధి కేంద్రాలతో అనుసంధానం చేస్తారు. కొత్తగా నాలుగు ఎస్టీపీలను ఏర్పాటు చేసి మూడు దశల్లో నీటిని శుద్ధి చేసి నిర్మాణ రంగం, పరిశ్రమలు, పచ్చదనం కోసం మళ్లీ వినియోగించేలా చర్యలు తీసుకోనున్నారు.
- పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, సైకిల్ మార్గాలుః బాపూఘాట్ వరకు నది పరిసర ప్రాంతాన్ని పచ్చిక బయళ్లు, పూల తోటలు, పార్కులతో అభివృద్ధి చేస్తారు. ప్రజలు విశ్రాంతి తీసుకునేలా వాకింగ్ ట్రాకులు, సైకిల్ ట్రాకులు, పిల్లల ఆటస్థలాలు, హోటళ్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
- 15 చోట్ల కొత్త వంతెనలుః మంచిరేవుల, నార్సింగి, సన్‌సిటీ తదితర ప్రాంతాలకు అనుసంధానం కోసం మూసీ, ఈసీ నదులపై 15 కొత్త వంతెనలు నిర్మించనున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా నది ఇరువైపులా విశాలమైన రోడ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు.
- దక్షిణ కొరియా తరహా అండర్ గ్రౌండ్ ఎస్టీపీః దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని హాన్ రివర్, చంగి చియాన్ నమూనాలో భూగర్భ ఎస్టీపీ ఏర్పాటు చేయనున్నారు. పైభాగంలో పార్కులు, నీటి కొలను, క్రీడా మైదానాలతో ప్రజలకు వినోదాన్ని కలిగించేలా రూపొందించనున్నారు.
- గాంధీ సరోవర్ – స్టాచ్యూ ఆఫ్ పీస్ః బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. మూసీ, ఈసీ, గోదావరి జలాలు కలిసే ప్రాంతంలో 100 మీటర్ల ఎత్తైన టవర్ నిర్మించి, దానిపై ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక ఉంది. టవర్‌లో గాంధీజీ జీవితం, చరిత్రను తెలియజేసే మ్యూజియం కూడా ఏర్పాటు చేయనున్నారు.
- 110 చ.కీ.మీ. పరిధిలో మాస్టర్ ప్లాన్ః మూసీ నది జంట జలాశయాల నుంచి గౌరెల్లి గ్రామం వరకు సుమారు 55 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నది ఇరువైపులా ఒక కిలోమీటరు పరిధిని కలుపుకుని మొత్తం 110.91 చ.కి.మీ ప్రాంతానికి భారీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మూసీ నది కేవలం నీటి ప్రవాహంగా కాకుండా పర్యాటక కేంద్రంగా, వాణిజ్య హబ్‌గా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. నగర ఆర్థికాభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..