Headlines

Hyderabad: ప్రతిరోజూ అర్ధరాత్రి ఒకే టైమ్‌కు.. ఒకే ఇంటి ముందు.. సీసీటీవీలో షాకింగ్ విజువల్స్..

Hyderabad: ప్రతిరోజూ అర్ధరాత్రి ఒకే టైమ్‌కు.. ఒకే ఇంటి ముందు.. సీసీటీవీలో షాకింగ్ విజువల్స్..


నిశబ్దంగా ఉన్న అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలు.. ఆకాశంలో వెలుగులు.. ఏదైనా పండగ అనుకుంటే పొరపాటే.. అది ఆకతాయిల వెర్రి వేషాలు. హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల తిరుమల హిల్స్ జైల్ కాలనీలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ ఘటనలు స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత రెండు రోజులుగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఐదుగురు యువకులు మద్యం మత్తులో కాలనీలోకి ప్రవేశిస్తున్నారు. ఎటువంటి సందర్భం లేకపోయినా ఎవరి పుట్టినరోజు వేడుకలు లేకపోయినా.. సరిగ్గా ఒకే ఇంటి ముందు 240 షాట్స్ ఉన్న భారీ టపాసులను వెలిగిస్తున్నారు. నిప్పు అంటించడమే ఆలస్యం.. ఆ యువకులు అక్కడి నుంచి పరారవుతున్నారు. ఈ దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ప్రమాదం తృటిలో తప్పింది..

టపాసులు వెలిగించిన వెంటనే అప్రమత్తమైన కాలనీవాసులు, బయటకు వచ్చి నీళ్లు చల్లి మంటలను ఆర్పుతున్నారు. ఒకవేళ ఏ మాత్రం ఆలస్యమైనా.. పక్కనే ఉన్న వాహనాలకు లేదా ఇళ్లకు నిప్పు అంటుకుని భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీర్‌పేట్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. అయితే ఈ ప్రాంతంలో గంజాయి వినియోగం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో, ఆకతాయిలు గంజాయి మత్తులోనే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కాలనీవాసుల డిమాండ్

‘‘ప్రతిరోజూ ఒకే సమయానికి, ఒకే ఇంటి ముందు ఇలా టపాసులు పేల్చడం వెనుక ఏదైనా కుట్ర ఉందా? లేక కేవలం మత్తులో చేస్తున్న పనా? అనేది పోలీసులు నిగ్గు తేల్చాలి. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి’’ అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *