
హైదరాబాద్ నగరాన్ని షాక్‌కు గురి చేసిన దారుణ ఘటన నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో చోటుచేసుకుంది. తనను మానసిక చికిత్సా కేంద్రంలో చేర్చారన్న ఆవేశంతో ఓ కొడుకు.. కన్న తల్లిదండ్రులను దారుణంగా చంపేశాడు. సాయినగర్‌కు చెందిన రాజయ్య (78), లక్ష్మి (65) దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రెండో కొడుకు శ్రీనివాస్ (36) మద్యానికి బానిసయ్యాడు. తరచూ మద్యం తాగి తన భార్యను హింసించడంతో ఆమె అతడిని వదిలేసి వెళ్లిపోయింది. దీంతో శ్రీనివాస్ తల్లిదండ్రుల వద్దే నివసిస్తూ రోజూ తాగి ఇంటికి వచ్చి గొడవ పడేవాడు.
ఈ పరిస్థితులు భరించలేకపోయిన తల్లిదండ్రులు, కొడుకు మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని భావించి కొంతకాలం క్రితం అతడిని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. కౌన్సిలింగ్, థెరపీ అనంతరం ఇటీవలే అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే తనను ఆసుపత్రిలో చేర్చారని మనసులో కక్ష పెట్టుకున్న శ్రీనివాస్.. అప్పటి నుంచి తల్లిదండ్రులను మరింత వేధించడం మొదలు పెట్టాడు. ఇటీవల వెల్డింగ్ షాపులో పనికి కుదిరి.. వచ్చిన డబ్బుతో రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో తగాదాలు పడుతుండేవాడు.
అయితే ఆదివారం రాత్రి పరిస్థితి మరింత విషమించింది. తనను మానసిక ఆసుపత్రిలో చేర్చారని కోపంతో రగిలిపోయిన శ్రీనివాస్.. కర్రతో తన తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఈ దాడిలో రాజయ్య, లక్ష్మి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు సమాచారమందించడంతో నేరెడ్మెట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన సాయినగర్‌లో కలకలం నింపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.