
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఫ్లూ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల సమయంలో మరింత చురుకుగా మారే ఈ ఫ్లూ వైరస్ ముఖ్యంగా శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణ జలుబులా అనిపించినా.. ఫ్లూ చాలా తీవ్రమైనదిగా మారవచ్చు. ఇది దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలు, బలహీనమైన రోగనిరోధక శక్తి దీని వ్యాప్తికి ప్రధాన కారణాలు.
ఫ్లూ లక్షణాలు ప్రభావం
ఫ్లూ సోకిన వారికి సాధారణంగా అధిక జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాలు-కీళ్ల నొప్పులు, నిరంతర దగ్గు, ముక్కు కారడం, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు కూడా ఉండవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేసి న్యుమోనియాకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
ఫ్లూలో అల్లం, తేనె ప్రభావం
దగ్గు, జలుబు వంటి లక్షణాలకు అల్లం, తేనెను సాంప్రదాయకంగా వాడుతుంటారు.
అల్లం: ఇందులో ఉండే జింజెరాల్ అనే పదార్థానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది గొంతు నొప్పిని తగ్గించి, శ్వాస మార్గాన్ని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.
తేనె: తేనెలో సహజంగా ఉండే యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు గొంతులో చికాకును తగ్గిస్తాయి. ఇది శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.
ఢిల్లీ ప్రభుత్వ ఆయుర్వేద విభాగం డాక్టర్ ఆర్.పి. పరాశర్ ప్రకారం.. అల్లం-తేనె మిశ్రమం ఫ్లూను పూర్తిగా నయం చేయదు కానీ లక్షణాల నుండి ఉపశమనం ఇస్తుంది. కాబట్టి వైద్యులు సూచించిన మందులతో పాటు దీనిని ఇంటి నివారణగా వాడటం మంచిది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
విశ్రాంతి: శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వండి.
ఆహారం: తేలికైన, పోషక విలువలు గల ఆహారం తీసుకోండి.
నీరు: ఎక్కువగా నీరు, వేడి ద్రవాలు తాగండి.
పరిశుభ్రత: రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండండి, మాస్క్ వాడండి. చేతులను తరచుగా శుభ్రం చేసుకోండి.
వైద్య సలహా: డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు. ఎందుకంటే అవి మీ ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.