పండుగ సీజన్‌కు ముందు జీఎస్టీ సంస్కరణలతో కేంద్రం సామాన్యలకు బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. సెప్టెంబర్ 22నుంచి జీఎస్టీ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీంతో బ్రెడ్ నుంచి మొదలు ఎలక్ట్రానిక్స్ వరకు చాలా వస్తువుల రేట్లు తగ్గుతాయి. ఎయిర్ కండిషనర్లు, పెద్ద స్క్రీన్ టీవీలతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ రేటును 28శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో ఈ వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయి.
జీఎస్టీ తగ్గింపు ప్రభావం
ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల ACలు, టీవీలు, డిష్‌వాషర్లు, మానిటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై పన్ను భారం తగ్గుతుంది. ఇది పండుగ సీజన్‌లో కొనుగోళ్లకు మరింత ప్రోత్సాహం అందిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ACల ధరల తగ్గుదల
జీఎస్టీ తగ్గింపుతో మధ్యస్థ శ్రేణి ఏసీ ధరలు రూ.1,500 నుండి రూ.2,500 వరకు తగ్గుతాయి. ఉదాహరణకు.. రూ.35,000 ధర ఉన్న ఒక ACపై గతంలో రూ.6,800 పన్ను ఉండేది. ఇప్పుడు 18శాతం పన్నుతో అది రూ.3,150కి తగ్గుతుంది. అంటే మొత్తం మీద రూ.3,000 కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు.
టీవీల ధరల తగ్గుదల
32 ఇంచెస్ కంటే పెద్ద LED, LCD టీవీల ధరలు రూ.1,000 నుండి రూ.5,000 వరకు తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు రూ.20,000 ధర ఉన్న ఒక టీవీపై గతంలో 28శాతం జీఎస్టీతో పన్ను రూ.5,600 ఉండేది. ఇప్పుడు 18శాతం జీఎస్టీతో పన్ను రూ.3,600కి తగ్గుతుంది. దీనివల్ల వినియోగదారులకు దాదాపు రూ.2,000 వరకు ఆదా అవుతుంది.
పెరగనున్న అమ్మకాలు
ఈ జీఎస్టీ తగ్గింపుతో ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో ధరలు తగ్గుతాయి. ఫలితంగా అమ్మకాలు పెరుగుతాయి. మీరు కొత్త ఏసీ లేదా టీవీ కొనుగోలు చేయాలనుకుంటే సెప్టెంబర్ 22 తర్వాత కొనుగోలు చేయడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఇది వినియోగదారులకు ఖచ్చితంగా పెద్ద ఉపశమనం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..