అంతర్జాతీయంగా బంగారం ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్దం మరికొన్ని రోజల పాటు కొనసాగే అవకాశముంది. ఇప్పటికప్పుడే పరిస్థితులు సద్దుమణిగేలా కనిపించడం లేదు. దీంతో పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గోల్డ్, సిల్వర్ ధరల్లో ఒడిదోడుకులు నెలకొన్నాయి.
బంగారం ధరలు భవిష్యత్తులో పెరిగే అవకాశముందని కొంతమంది చెబుతుండగా.. మరికొంతమంది తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. ఈ నివేదికలో బంగారం ధరలు పెరిగే అవకాశముందని అంచనా వేసింది. ఇందుకు పలు కారణాలను కూడా వెల్లడించింది.
అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్దాల వల్ల డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర రూపాల్లో తమ నిల్వలను పెంచుకునేందుకు కేంద్ర బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా గోల్డ్ నిల్వలను పెంచుకుంటున్నాయి. దీని వల్ల ధరలు భవిష్యత్తులో పెరిగే అవకాశముందని తన రిపోర్టులో పొందుపర్చింది.
2025 ఆగస్టు నుంచి 2026 మార్చి వరకు ఏకంగా బంగారం ధరల్లో 47.6 శాతం పెరుగుదల నమోదైంది. 2025 ఆగస్టులో ఔన్సుకు 3,448 డాలర్లు ఉండగా.. ఇప్పుడు 5,092 డాలర్లకు చేరుకుంది. డాలర్లలో తమ విదేశీమారక నిల్వలను తగ్గిస్తున్న కేంద్ర బ్యాంకులు.. బంగారంలో పెట్టుబడులను పెంచుకుంటున్నాయి.
కేంద్ర బ్యాంకుల వ్యూహత్మక మార్పు వల్ల బంగారం ధరలు రానున్న రోజుల్లో పెరిగే అవకాశముంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,63,640గా ఉండగా.. 222 క్యారెట్ల ధర రూ.1.50 లక్షల వద్ద ఉంది. అటు వెండి ధర రూ.2.90 లక్షల వద్ద కొనసాగుతోంది.




