
పండుగ సీజన్ ప్రారంభమైంది.. ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, తర్వాత ధంతేరస్, దీపావళి వస్తున్నాయి. దీంతో ఈ పండగ సీజన్లో బంగారం వెండి ధరలు తగ్గుతాయా? లేదా 10 గ్రాములకు రూ.1.5 లక్షల నుండి రూ.2 లక్షలకు చేరుకుంటాయా? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. పండుగ సీజన్లో బంగారం, వెండిని కొనుగోలు చేయడం భారతీయ సంప్రదాయంలో శుభప్రదంగా పరిగణిస్తారు. మరి బంగారానికి డిమాండ్ పెరిగే సూచనలు కనిపిస్తున్న తరుణంలో ధర ఎలా ఉండబోతుంది? దీపావళి నాటికి తగ్గుతుందా? పెరుగుతుందా? అనేది తెలుసుకోవడానికి కేడియా క్యాపిటల్ వ్యవస్థాపకుడు అజయ్ కేడియా వివరణ ఎలా ఉందో చూద్దాం..
దీపావళి నాడు బంగారం, వెండి ధరలు తగ్గుతాయా?
పండుగ సీజన్లో బంగారం, వెండి కొనుగోలు భారీగా జరుగుతుంది. దీంతో ధరలు పెరుగుతాయా? అంటే అజయ్ కేడియా స్పందిస్తూ.. గత ఏడాది బంగారం, వెండి 50 శాతానికి పైగా రాబడిని ఇచ్చాయని, ప్రస్తుతం బంగారం విలువ ఎక్కువగా ఉందని అన్నారు. తత్ఫలితంగా రాబోయే రోజుల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఈ తగ్గుదల కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. వెండి గురించి మాట్లాడుతూ.. వెండి కూడా బంగారంతో సమానమైన రాబడిని ఇచ్చిందని, అయితే డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో వెండి ధర తగ్గడం కష్టమని అన్నారు.
సెప్టెంబర్ 26న ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,700గా ఉంది. అజయ్ కేడియా ప్రకారం భౌగోళిక రాజకీయ పరిస్థితి మరింత దిగజారితే లేదా అమెరికా అధ్యక్షుడు భారతదేశంపై కొత్త సుంకాలను విధించినట్లయితే మాత్రమే బంగారం ధరలు మరింత పెరగవచ్చు. గత ఆరు నుండి ఎనిమిది నెలల ఆధారంగా, అమెరికా భారతదేశంపై సుంకాలు విధించినప్పుడే బంగారం ధరలు పెరిగాయని, భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అనిశ్చితి వాతావరణాన్ని సృష్టించాయని ఆయన వివరించారు. అటువంటి పరిస్థితులలో, పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్‌ను విడిచిపెట్టి, సురక్షితమైన స్వర్గధామమైన బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారని, అందుకే గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పెరిగాయని ఆయన అన్నారు. రాబోయే మూడు నుండి నాలుగు నెలల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గవచ్చని కూడా ఆయన స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 26న ఢిల్లీ బులియన్ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.1,41,700 లక్షలుగా ఉంది. అజయ్ కేడియా ప్రకారం.. వెండి ధర గణనీయంగా తగ్గదు. విద్యుత్ విభాగంలో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది, వెండి ఉత్పత్తి పెరగకపోవడంతో ప్రజలు వెండిపై తక్కువ పెట్టుబడి పెట్టవచ్చు, కానీ వెండి డిమాండ్ మారదని ఆయన విశ్వసిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి