Gas Cylinder: హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన.. ఏమన్నదంటే..?

Gas Cylinder: హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన.. ఏమన్నదంటే..?


Gas Cylinder: హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన.. ఏమన్నదంటే..?

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వివాదం 13వ రోజుకు చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత్‌లో కూడా ఎల్‌పీజీ కొరత భయాందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు గట్టి భరోసా ఇచ్చింది. దేశంలో ఇంధన నిల్వలకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ జరిపిన దౌత్యంతో భారత్‌కు భారీ విజయం లభించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీతో చర్చల అనంతరం భారత జెండాతో కూడిన ట్యాంకర్లను హార్ముజ్ జలసంధి గుండా వెళ్లడానికి ఇరాన్ అనుమతించింది. MT పుష్పక్, MT పరిమల్ అనే రెండు భారతీయ ఆయిల్ ట్యాంకర్లు ఈ ఉద్రిక్త జలసంధి గుండా సురక్షితంగా మన దేశానికి వస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ భారత్‌కు ఈ వెసులుబాటు లభించడం విశేషం. సౌదీ అరేబియా నుండి వచ్చిన షెన్‌లాంగ్ ట్యాంకర్ కూడా ఇప్పటికే ముంబై ఓడరేవుకు చేరుకుంది.

భయాందోళన వద్దు

పార్లమెంటులో పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఇలాంటి సవాళ్లు ఎదురైనా, దేశ ముడి చమురు సరఫరా సురక్షితంగా ఉంది. హార్ముజ్ జలసంధి దిగ్బంధానికి ముందే మనం వ్యూహాత్మక చర్యలు చేపట్టాం. మన శుద్ధి కర్మాగారాలు 100 శాతానికి మించిన సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లేదా ఏవియేషన్ ఫ్యూయల్ కొరత ఏమాత్రం లేదు’’ అని స్పష్టం చేశారు. దేశీయంగా LPG ఉత్పత్తి కూడా 28 శాతం పెరిగిందని ఆయన వెల్లడించారు.

పానిక్ బుకింగ్‌లతోనే సమస్య

పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. దేశంలో రోజుకు సుమారు 50 లక్షల సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. యుద్ధం నేపథ్యంలో ప్రజలు భయాందోళనతో ముందస్తుగా సిలిండర్లు బుక్ చేయడం వల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని.. పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధి 21 నుండి 25 రోజులకు పెరిగినప్పటికీ, సరఫరాను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. భయాందోళనతో అనవసర బుకింగ్‌లు చేయవద్దని ఆమె పౌరులకు విజ్ఞప్తి చేశారు.

ఇండక్షన్ కుక్‌టాప్‌లకు పెరిగిన డిమాండ్

ఎల్‌పీజీ కొరత వార్తల నేపథ్యంలో ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మార్కెట్లో ఇండక్షన్ కుక్‌టాప్‌ల అమ్మకాలు ఒక్కసారిగా 75 నుండి 80 శాతం పెరిగాయని రిటైలర్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల రెస్టారెంట్లు గ్యాస్ అందక మూతపడుతున్నాయనే వార్తల నేపథ్యంలో ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల సరఫరాకు ప్రాధాన్యత ఇస్తోంది.

మధ్యప్రాచ్య పరిస్థితి ఏమిటి?

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా కీలక నేతలు మరణించడంతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ భారత్‌తో ఉన్న దౌత్య సంబంధాల దృష్ట్యా మన నౌకలకు మార్గం సుగమం చేయడం గమనార్హం.

హెచ్చరిక

సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకండి. ప్రభుత్వ అధికారిక ప్రకటనల ప్రకారం ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయి. అనవసరంగా గ్యాస్ బుక్ చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *