
కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నప్పుడు కేవలం ధర ఒక్కటే కాకుండా అందులో లేటెస్ట్‌గా వస్తున్న టెక్నాలజీ ఉందా లేదా? 2025కి తగ్గ ఫీచర్లు అందులో ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుని కొనాలి. స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన ఫీచర్లు, ఆప్షన్లు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రాసెసర్
మొబైల్ కొనేటప్పుడు ముందుగా చెక్ చేసుకొవాల్సింది ప్రాసెసర్. ఫోన్ కు గుండె వంటిది ఈ ప్రాసెసర్. ప్రస్తుతం మార్కెట్లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్, మీడియాటెక్, శాంసంగ్ ఎక్సినోస్ వంటి పలు ప్రాసెసర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏయే ప్రాసెసర్ ఎంత ధరలో లభిస్తుందో తెలుసుకోవాలి. మంచి ప్రాసెసర్ తక్కువ ధరకు లభిస్తే అది మంచి డీల్ అన్నట్టు లెక్క.
డిస్ ప్లే
మొబైల్ కొనేముందు చూసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం డిస్‌ప్లే. వీటిల్లో ఎల్‌సీడీ, ఎల్‌ఈ డీ, అమోలెడ్.. ఇలా పలు రకాలున్నాయి. వీటిలో ఎల్‌ఈడీ, అమోలెడ్ అనేవి లేటెస్ట్ టెక్నాలజీ డిస్‌ప్లేలు. ఎల్ సీడీ కాస్త పాత టెక్నాలజీ. అంత క్వాలిటీ ఉండకపోవచ్చు. స్క్రీన్ అలాగే రిజల్యూషన్ విషయంలో మినిమమ్ ఫుల్ హెచ్‌డీ లేదా అంతకుమించి.. అంటే 2కె, 4కె వంటివి ఎంచుకోవాలి. కేవలం నార్మల్ హెచ్‌డీ డిస్ ప్లే తీసుకోవడం వల్ల డిస్ ప్లే క్వాలిటీ బాగుండదు. అలాగే రీఫ్రెష్ రేటు కూడా మినిమం 90 హెర్ట్జ్ ఉండాలి.
కెమెరా
ఈ రోజుల్లో ఫోన్ లో కెమెరా అన్నది చాలా ముఖ్యం. అయితే కెమెరా విషయంలో మొబైల్ కంపెనీలు మోసం చేస్తుంటాయి. మెగాపిక్సెల్స్ ఎక్కువ ఉంటే మంచి కెమెరా అన్నట్టు ప్రమోట్ చేస్తుంటాయి. కానీ, అది నిజం కాదు. ఫొటో క్వాలిటీ అనేది సెన్సర్ ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు చైనీస్ బ్రాండ్స్ మొబైల్స్‌లో 200 ఎంపీ కెమెరా కన్నా.. శాంసంగ్ ఎస్ సిరీస్, ఐఫోన్స్ లోని 16 ఎంపీ కెమెరాలు మంచి పెర్ఫామెన్స్ ఇస్తాయి. కాబట్టి కెమెరా క్వాలిటీని గూగుల్ లో చెక్ చేసి తీసుకోవడం బెటర్.
స్టోరేజ్, బ్యాటరీ
ఇకపోతే మొబైల్‌లో బ్యాటరీ అనేది చాలా కీలకమైన భాగం. కాబట్టి బ్యాటరీ కెపాసిటీ మినిమమ్ 5000 ఎంఏహెచ్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ర్యామ్ కనీసం 4జీబీ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే ఇంటర్నల్ స్టోరేజీ 64 జీబీ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..