Dussehra 2025: ఆయుధ పూజ ప్రాముఖ్యత? శుభ సమయం ఎప్పుడంటే..

Dussehra 2025: ఆయుధ పూజ ప్రాముఖ్యత?  శుభ సమయం ఎప్పుడంటే..


హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి దసరా.. దీనినే విజయదశమి అని కూడా అంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే గొప్ప పండుగ. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ 2025 గురువారం దేశవ్యాప్తంగా గొప్ప వైభవంగా జరుపుకోవడడానికి రెడీ అవుతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. ఈ రోజు లంక రాజు రావణుడిపై శ్రీ రాముడు సాధించిన విజయానికి గుర్తుగా మాత్రమే కాదు.. దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన రోజుగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం దసరా ఖచ్చితమైన తేదీ, ఆయుధ పూజ, రావణ దహనానికి అనుకూలమైన సమయం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

దసరా తేదీ.. శుభ సమయం

దశమి తిథి ప్రారంభమవుతుంది: 1 అక్టోబర్ 2025 సాయంత్రం 7:01 నుంచి

దశమి తిథి ముగుస్తుంది: 2 అక్టోబర్ 2025 రాత్రి 7:10 దశమి తిథి ముగుస్తుంది. కనుక ఉదయం తిథి ప్రకారం దసరా వేడుకలను అక్టోబర్ 2వ తేదీన జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఆయుధ పూజ: అక్టోబర్ 2, 2025న మధ్యాహ్నం 2:09 నుంచి 2:56 వరకు (వ్యవధి: 47 నిమిషాలు)

మధ్యాహ్నం పూజ సమయం: 2 అక్టోబర్ 2025 మధ్యాహ్నం 1:21 నుంచి 3:44 వరకు.

రావణ దహనానికి శుభ సమయం: అక్టోబర్ 2, 2025, సూర్యాస్తమయం తరువాత సాయంత్రం 6:05 గంటల ప్రాంతంలో (ప్రదోష కాలం)

ఆయుధ పూజ పద్ధతి

విజయదశమి నాడు విజయ ముహూర్తంలో ఆయుధ పూజ చేయడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ముహూర్తంలో పూజ చేయడం జీవితంలోని అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుంది.

పరిశుభ్రత: ముందుగా, ప్రార్థనా స్థలాన్ని.. పూజించాల్సిన ఆయుధాలు లేదా పనిముట్లను పూర్తిగా శుభ్రం చేయాలి

సంస్థాపన: అన్ని ఆయుధాలు, పరికరాలను శుభ్రమైన ఎరుపు వస్త్రంపై ఉంచండి.

శుద్ధి: ఆయుధాలపై గంగా జలాన్ని చల్లి శుద్ధి చేయండి.

తిలకం, పూల మాల: తర్వాత ఆయుధాలకు లేదా పని ముట్లకు పసుపు, కుంకుమ, గంథంతో తిలకం దిద్ది.. వాటికీ పువ్వులు లేదా పువ్వుల మాల సమర్పించండి.

పూజ: దీపం వెలిగించి ఆయుధాల ముందు ధూపం వేయండి. జమ్మి ఆకులతో పూజ చేయండి. అక్షతలను సమర్పించండి. స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి.

సంకల్పం, మంత్రం: పూజ సమయంలో ‘. ఓం జయంతీ మంగళ కాళీ భద్రకాలీ కపాలినీ దుర్గా క్షమా శివ ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే ।.’ అనే మంత్రాన్ని పఠించండి. జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించాలని సంకల్పం చేసుకోండి.

విజయదశమి ప్రాముఖ్యత

సత్యం విజయం: పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించాడు. ఈ పండుగ చెడుపై మంచి .. అధర్మంపై ధర్మం విజయం.. శాశ్వత సందేశాన్ని తెలియజేస్తుంది.

శక్తి ఆరాధన: శరదీయ నవరాత్రులలో తొమ్మిది రోజులు దుర్గాదేవిని పూజించిన తర్వాత పదవ రోజున విజయదశమిగా జరుపుకుంటారు. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి, ప్రపంచాన్ని రాక్షస బాధలనుంచి విడిపించిందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజును అమ్మవారి “విజయ” రూపాన్ని పూజించే రోజుగా కూడా పరిగణిస్తారు.

ఆయుధాలు, గ్రంథాల పూజ: పురాతన కాలంలో రాజులు , యోధులు ఈ రోజున విజయాన్ని కోరుతూ ఆయుధాలను పూజించేవారు. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.. ప్రజలు శక్తి , జ్ఞానం పట్ల గౌరవాన్ని వ్యక్తపరచడానికి తమ ఆయుధాలను (సామగ్రి, పనిముట్లు, వాహనాలు, పుస్తకాలు మొదలైనవి) పూజిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *