సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో సూర్య-జ్యోతికల జోడీ ఒకటి. ‘కాకా'(తెలుగులో ఘర్షణ) సినిమా చేస్తున్నప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2006లో పెళ్లి పీటలెక్కిన సూర్య-జ్యోతికలకు దియా, దేవ్ అని ఇద్దర పిల్లలన్నారు. ఇందులో కూతురు దియా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు కాగా ఇటీవలే స్కూలింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు అమ్మానాన్నల బాటలోనే అడుగు వేస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే హీరోయిన్ గా కాదు డైరెక్టర్ గా. 17 ఏళ్ల వయసున్న దియా ‘లీడింగ్ లైట్స్’ అనే డాక్యుమెంటరీతో దర్శకురాలిగా పరిచయమవుతుంది. 13 నిమిషాల నిడివి గల బాలీవుడ్ డాక్యుమెంటరీ ఇది. మహిళా గాఫర్స్.. అంటే సినిమా సెట్లలో లైటింగ్ విభాగంలో పని చేసే నిపుణుల ఇతివృత్తంతో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. పురుషాధిక్యత గల సినిమా రంగంలో లేడీ గాఫర్స్ కష్టాలు, సవాళ్లు, డెడికేషన్ ఎలా ఉంటాయన్న అంశాలతో లీడింగ్ లైట్స్ షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించింది దియా. హేతాల్ దెద్డియా, ప్రియాంకా సింగ్, లీనా గంగుర్దే అనే ముగ్గురు మహిళా గాఫర్లు తమ అనుభవాలు, శారీరక, మానసిక సవాళ్లు, లింగ వివక్షను అధిగమించిన విధానాన్ని ఇందులో చూపించనున్నారు. సూర్య-జ్యోతిక తమ ప్రొడక్షన్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పైనే ఈ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు.
‘లీడింగ్ లైట్స్’ షార్ట్ ఫిల్మ్ ను లాస్ ఏంజిల్స్‌లోని రెజెన్సీ థియేటర్‌లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రదర్శించనున్నారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌తో 2026 ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ కేటగిరీకి అర్హత సాధించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుని మురిసిపోయారు సూర్య–జ్యోతిక దంపతులు.. ‘మా కూతురు దియా తీసిన ‘లీడింగ్ లైట్’ సినిమాకు మేం సపోర్ట్ చేస్తున్నందుకు గర్వపడుతున్నాం. బాలీవుడ్ మహిళా గ్రాఫర్ల జీవన ప్రయాణం మీద వెలుగు ప్రసరించే ఆ లఘు చిత్రాన్ని అందరికీ చేరువ చేయడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు సూర్య- జ్యోతిక.
ఇవి కూడా చదవండి
సూర్య- జ్యోతికల పోస్ట్..
#LeadingLight The untold stories of Women behind the scenes – A docu-drama that discusses the experiences of Women Gaffers of Bollywood. Screening for the ‘Oscar qualifying run’ at the Regency Theatre, LA, California ✨
Congratulations, our dearest #DiyaSuriya, on this… pic.twitter.com/84h9OSpz58
— 2D Entertainment (@2D_ENTPVTLTD) September 26, 2025
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువరు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సూర్య-జ్యోతిక దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే దియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.