
సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ విడుదలకు మరి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అయితే రిలీజ్ కు ముందే ఈ క్రేజీ సీక్వెల్ రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే భారీ వసూళ్లను రాబడుతోంది. సినిమా రిలీజ్ (మార్చి 19) కు ఒక్క రోజు ముందే అంటే మార్చి 18 సాయంత్రం నుంచే ధురంధర్ 2 ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే ధురంధర్ ప్రివ్యూషోస్ ఉండడంతో ఈ సినిమా టిక్కెట్ల రేట్లు ఆకాశానంటుతున్నాయి. అయినా ప్రేక్షకులు మాత్రం భారీగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ధురందర్ 2 సినిమా టిక్కెట్ ఒక్కొక్కటి రూ. 3100 పలుకుతోంది. అలాగే ముంబైలోని బోరివాలిలోని ఐనాక్స్ మెగాప్లెక్స్‌లో రిక్లైనర్ సీట్ల ధర రూ.3,100కి చేరుకుంది. ఢిల్లీలోని పివిఆర్ సెలెక్ట్ సిటీ వాక్‌లో ధర రూ.2,400 వరకు ఉంది. మెట్రో నగరాల్లో సాధారణ టికెట్ల ధర రూ.600 నుంచి 900 వరకు ఉంది. ఐమాక్స్ షోల ధర రూ.1,000 కంటే ఎక్కువ అయినప్పటికీ, చాలా షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి.
హిందీలోనే కాకుండా దక్షిణ భారత భాషల్లో కూడా ధురందర్ 2 చిత్రానికి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ‘ధురంధర్ 2’ టిక్కెట్లు తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు రూ.400కి అమ్ముడవుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రదేశాలలో ఈ సినిమా హిందీ వెర్షన్ టిక్కెట్లు రూ.1,000కి పైగా అమ్ముడవుతున్నాయి. తమిళనాడులో ధర పరిమితి కారణంగా ధరను రూ.166గా నిర్ణయించారు. ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ‘ధురంధర్ 2’ సినిమా కోసం దాదాపు 3.50 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా విడుదలకు ముందే ఈ సినిమా భారతదేశంలో రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్ సినిమా ప్రీమియర్‌కు ఇదే అత్యధిక కలెక్షన్.
ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ధురందర్ చిత్రంలో రణ్వీర్ సింగ్ స్పై ఏజెంట్ గా నటించాడు. అలాగే ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దురంధర్ 1 ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ కూడా అంతకు మించి దాదాపు రూ. 2000 కోట్ల టార్గెట్ గా బరిలోకి దిగుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ధురంధర్ 2 సినిమా తెలుగు ట్రైలర్ ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.