
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే మాడు పగిలేంతగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి ఉగ్రరూపంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండ ప్రభావంతో పాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏదైనా పని మీద బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నాయి. మార్చిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా.. ఏప్రిల్ నాటికి రికార్డు స్థాయికి చేరుకునే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. వడగాల్పులు కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే ఎండల క్రమంలో హీట్ వేవ్ నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లల్లో ఏసీలు, కూలర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కొంతమంది వీటిని ఈ మూడు నెలల కోసం రెంట్‌కి కూడా తెచ్చుకుంటున్నారు.
పెరుగుతున్న అద్దె మార్కెట్
హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల అద్దె మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సమ్మర్ కావడంతో వేడి నుంచి తప్పించుకుని చల్లదనం పొందేందుకు ఏసీలు, కూలర్లు అద్దెకు తెచ్చుకుంటున్నారు ప్రజలు. కొత్త ఏసీ కొనాలంటే రూ.30 వేల పైమాటే. ఇక కూలర్ కొనాలన్నా రూ.10 వేలపైనే పడుతుంది. కొత్తవి కొనుగోలు చేసేందుకు ఆర్ధిక స్తోమత లేనివారు అద్దెకు తెచ్చుకుంటున్నారు. కేవలం నెలకు రూ.500కే కూలర్ అద్దెకు లభిస్తుంది. వేసవికాలం వస్తుండటంతో నగరంలో ఈ అద్దె కూలర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇక వీటిని అద్దెకు ఇచ్చే కంపెనీలకు కూడా బోల్డెంత ఆదాయం వస్తోంది. బ్యాచిలర్ రూమ్స్‌లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు వీటిని ఎక్కువగా రెంట్‌కు తీసుకుంటున్నారు. ఇక ఆర్ధిక స్తోమత లేని సామాన్య కుటుంబాలు కూడా కూలర్లను అద్దెకు తెచ్చుకుంటున్నారు.
మూడు నెలల కోసం..
ఎక్కువగా సమ్మర్‌లో మూడు నెలల పాటు కూలర్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత కూలర్ అవసరం పెద్దగా ఉండదు. మూడు నెలల కోసం కొత్త కూలర్ కొనడం అవసరమా అని చాలామంది ఆలోచిస్తున్నారు. కొత్త కూలర్ కొన్నా ఎక్కువ కాలం పనిచేయవు. ఒక ఏడాది తర్వాత ఏదొక సమస్య తలెత్తుతూ ఉంటుంది. దీంతో తక్కువ ఖర్చుకు వచ్చే అద్దె కూలర్లను తెచ్చుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మూడు నెలల కోసం వేలల్లో ఖర్చు పెట్టడం అనవసరమనే భావనకు వస్తున్నారు. రోజూవారీ పనులు చేసుకుని జీవనం కొనసాగించేవారికి, బ్యాచిలర్లు వీటిని ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లోనే అద్దె ప్రతిపాదికన కూలర్ బుక్ చేసుకుంటే ఇంటికే డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇక కూలర్ బ్రాండ్‌ను బట్టి నెలకు రూ.500 నుంచి రూ.800 వరకు అద్దె ఉంటుంది. అయితే కొంత మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రెంటల్ అప్లయన్సెస్ ప్లాట్‌ఫామ్‌లు ఆన్‌లైన్‌లో అనేకం అందుబాటులో ఉన్నాయి.