ఈ నెల 23 న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క సారలమ్మ పూజారులను సీఎం సంప్రదించనున్నారు. ఆ తర్వాత పూజారుల సూచనల మేరకు వారి ఆమోదంతో ఆలయ అభివృద్ధిపై డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు.ఈ మేరకు శనివారం మేడారం అభివృద్ధి ప్రణాళికపై సీఎం అధికారులకు సమీక్ష నిర్వహించారు. మేడారం జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని ప్రభుత్వం అనుకున్నట్టు తెలిపారు. గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలని, ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంత సంప్రదాయ వృక్షాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అయితే 23న సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు కూడా మేడారం వెళ్లనున్నారు. అక్కడి వెళ్లిన తర్వాత మేడారం జాతర పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు దట్టమైన అటవీ ప్రాంతం జల్లెడ పడుతుండగా, జిల్లా పోలీస్ యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
అయితే ఈ నెల 16నే సీఎం రేవంత్ మేడారంలో పర్యటించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలవల్ల పర్యటన వాయిదా పడింది. తాజాగా శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నెల 23న మేడారం వెళ్లేందుకు సీఎం షెడ్యూల్ ఖరారైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.