గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్ న్యూరో, స్పైన్ సర్జరీ నిపుణుడు డాక్టర్ ఉత్కర్ష్ భగత్ ప్రకారం.. రీల్స్ నిరంతరంగా చూడటం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి రెండూ దెబ్బతింటాయి. దీని వల్ల ఒకే పనిపై దృష్టి పెట్టడం కష్టం అవుతుంది.
ఏకాగ్రత తగ్గుతుంది: రీల్స్ వేగంగా మారుతూ ఉంటాయి. వాటిని చూస్తున్నప్పుడు మన మెదడు ఒక దాని నుంచి మరొక దానికి వేగంగా మారాల్సి వస్తుంది. దీనివల్ల పుస్తకాలు చదవడం లేదా క్లిష్టమైన ప్రాజెక్టులపై పనిచేయడం లాంటి వాటిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది.
జ్ఞాపకశక్తిపై ప్రభావం: నిరంతరం మారే కంటెంట్ వల్ల వర్కింగ్ మెమరీ దెబ్బతింటుంది. అలాగే మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు దాన్ని గుర్తుంచుకోవాల్సిన సామర్థ్యం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా స్క్రీన్ వైపు ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లు పొడిబారడం, దురద వంటి సమస్యలు వస్తాయి. నిద్ర కూడా సరిగా పట్టదు.
రివార్డ్ సిస్టమ్ దెబ్బతింటుంది: రీల్స్ చూడటం వల్ల మెదడులో డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది ఒక రకమైన వ్యసనం లాగా మారి ఇతర సాధారణ పనులను ఆస్వాదించలేకుండా చేస్తుంది. దీని వల్ల చిరాకు, ఆందోళన వంటి మానసిక సమస్యలు వస్తాయి.
డాక్టర్ ఉత్కర్ష్ భగత్ సూచించిన దాని ప్రకారం.. రీల్స్ చూసే సమయాన్నికి ఒక లిమిట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత్రిపూట ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవడం మంచిది. ఎక్కువ స్క్రీన్ సమయం చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది.