బిహార్‌లో ఇండి కూటమి సీఎం అభ్యర్ధిపై సస్పెన్స్ తొలగిపోయింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌నే సీఎం అభ్యర్ధి అని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. చాలా రోజుల నుంచి ఈవిషయంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్నికల ఫలితాల తరువాతే సీఎం ఎవరో తేలుతుందని ఇన్నాళ్లు చెప్పిన కాంగ్రెస్ నేతలు మనస్సు మార్చుకున్నారు. తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్ధిత్వంపై ఎలాంటి అభ్యంతరం లేదని బిహార్ కాంగ్రెస్ ప్రకటించింది. ప్రస్తుతం బిహార్ అధికార్ యాత్రలో ఉన్నారు తేజస్వి యాదవ్. ఐదు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. జెహానాబాద్ , నలందా , పాట్నా , బెగూసరాయ్ లాంటి జిల్లాల్లో పర్యటించారు తేజస్వి. సీఎం నితీష్‌కు పట్టున్న జిల్లాల్లో పర్యటించారు. గతంలో రాహుల్ ఓట్ అధికార్ యాత్రలో తేజస్వి కూడా పాల్గొన్నారు.
ఆ యాత్రతో కాంగ్రెస్‌కు మైలేజ్ వచ్చిందన్న భావనలో ఉన్న తేజస్వి యాదవ్ ఒంటరిగా యాత్ర చేపట్టారు. అవసరమైతే అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి ఆర్జేడీ సిద్దంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను కలవరపెట్టాయి. దీంతో బిహార్ కాంగ్రెస్ నేతల డ్యామేజ్ కంట్రోల్ చేపట్టారు. ఇండి కూటమి సీఎం అభ్యర్ధిగా తేజస్వి యాదవ్ ఉంటారని ప్రకటన విడుదల చేశారు. దీంతో కూటమిలో సీఎం అభ్యర్ధి రచ్చకు ఫుల్‌స్టాప్ పెట్టినట్టే భావించవచ్చు.
తేజస్వి యాదవ్ చేపట్టిన బిహార్ అధికార్ యాత్ర కాంగ్రెస్ హైకమండ్ పై తీవ్ర ఒత్తిడిని పెంచినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అటు ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్ధిగా నితీష్‌కుమారే ఉంటారని బీజేపీ నేతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. గెలుపుపై అటు ఎన్డీఏ , ఇటు ఇండి కూటమి నేతలు ధీమాతో ఉన్నారు. అయితే తేజస్వి యాదవ్ మాత్రం తన పంతాన్ని ఇప్పటికే నెగ్గించుకున్నారు.