
BCCI Awards : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) క్రీడారంగంలో అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. రేపు (మార్చి 15న) న్యూఢిల్లీలో జరగనున్న నమన్ (NAMAN) అవార్డుల వేడుకలో భారత క్రికెట్ ముగ్గురు దిగ్గజాలను లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో గౌరవించనుంది. పురుషుల విభాగంలో టీమిండియా మాజీ కెప్టెన్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్‌లకు ప్రతిష్టాత్మకమైన కల్నల్ సి.కె. నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారం దక్కనుంది. ఇక మహిళా క్రికెట్ రూపురేఖలను మార్చిన లెజెండరీ ప్లేయర్ మిథాలీ రాజ్‌ను బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఫర్ ఉమెన్ అవార్డుతో సత్కరించనున్నారు. ఈ గౌరవంతో పాటు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు బహుమతిని కూడా అందజేయనున్నారు.
ఈ ముగ్గురిలో రోజర్ బిన్నీ పేరు వినగానే మనకు 1983 ప్రపంచకప్ విజయం గుర్తుకొస్తుంది. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసి భారత్ తొలిసారి వరల్డ్ కప్ ముద్దాడటంలో బిన్నీ కీలక పాత్ర పోషించారు. క్రికెట్ ఆడిన రోజుల్లోనే కాకుండా, రిటైర్మెంట్ తర్వాత కూడా కోచ్‌గా, సెలక్టర్‌గా ఆయన సేవలు వెలకట్టలేనివి. 2000లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమ్‌కు ఆయన కోచ్‌గా వ్యవహరించారు. అంతేకాదు, 2022 నుంచి 2025 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టి క్రికెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయనకు ఈ అత్యున్నత గౌరవం దక్కుతోంది.
మరో దిగ్గజం ది వాల్ రాహుల్ ద్రవిడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్లో 24 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించిన ద్రవిడ్, దశాబ్ద కాలం పాటు భారత బ్యాటింగ్ కు వెన్నెముకలా నిలిచారు. ఆటగాడిగానే కాకుండా కోచ్‌గా ఆయన సక్సెస్ గ్రాఫ్ అద్భుతం. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలోనే భారత్ 2018 అండర్-19 ప్రపంచకప్ గెలిచింది. ఇక సీనియర్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్, 2024లో భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించి అద్భుతమైన వీడ్కోలు పలికారు. భారత క్రికెట్ ప్రస్థానంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.
మహిళా క్రికెట్ అనగానే మన దేశంలో మొదట గుర్తొచ్చే పేరు మిథాలీ రాజ్. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఆమె వన్డేల్లో 7805 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. భారత మహిళా జట్టును రెండుసార్లు ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన ఘనత ఆమెది. దేశంలో లక్షలాది మంది అమ్మాయిలు క్రికెట్ బ్యాట్ పట్టడానికి మిథాలీ స్ఫూర్తిగా నిలిచారు. మహిళా క్రికెట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఆమెను ఈ గౌరవానికి ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ అవార్డుల వేడుకలో గత సీజన్లో రాణించిన యువ ఆటగాళ్లకు కూడా అవార్డులు అందజేయనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..