Asia Cup Trophy Controversy: పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా 2025 ఆసియా కప్‌ను గెలుచుకున్నప్పటికీ, విజేతలకు దక్కాల్సిన ట్రోఫీని మాత్రం స్వీకరించలేదు. దీనికి కారణం పాకిస్థాన్ హోం మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించడమే. భారత్ అభ్యర్థనను నఖ్వీ తిరస్కరించడంతో భారత జట్టు ట్రోఫీని స్వీకరించలేదు. ఈ సంఘటన తర్వాత, మొహసిన్ నఖ్వీ ట్రోఫీని, టీమిండియా ఆటగాళ్ల మెడల్స్‌ను కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయారు. ఈ వివాదంపై స్పందించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మొహసిన్ నఖ్వీ నుండి ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించిందని ఏసీసీ స్పష్టం చేసింది. యూఏఈ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖాలిద్ అల్ జరూని చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత్ తెలియజేసింది. అయితే, ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న మొహసిన్ నఖ్వీ స్వయంగా ట్రోఫీని ఇవ్వాలని పట్టుబట్టారు. భారత జట్టు అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో భారత జట్టు ట్రోఫీని స్వీకరించలేదు. ఈ సంఘటన అనంతరం మొహసిన్ నఖ్వీ ట్రోఫీని, టీమిండియా ఆటగాళ్లకు ఇవ్వాల్సిన పతకాలను కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయారు. ఈ వివాదంపై బీసీసీఐ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది.
ట్రోఫీని నిరాకరించిన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. తిలక్ వర్మతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ, దాని కింద ఎమోజీలతో ట్రోఫీ ఆకారాన్ని క్రియేట్ చేశారు. ఆ పోస్ట్‌కు క్యాప్షన్‌గా, “మ్యాచ్ ముగిసిన తర్వాత విజేత జట్టును మాత్రమే గుర్తుంచుకుంటారు. ట్రోఫీ చిత్రాన్ని కాదు” అని సూర్యకుమార్ రాసుకొచ్చారు. ఈ కామెంట్స్ మొహసిన్ నఖ్వీ చర్యలను పరోక్షంగా తప్పుబడుతూ, తమ జట్టు విజయమే అసలైన గుర్తింపు అని చెప్పినట్లుగా ఉన్నాయి.
ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. పహల్‌గామ్ టెర్రరిస్ట్ దాడి, ఆపరేషన్ సింధూర్ వంటి సంఘటనల కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు టోర్నమెంట్ అంతటా కొనసాగాయి. మ్యాచ్ అనంతర ప్రెస్ మీట్లో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విజేత జట్టుకు ట్రోఫీ ఇవ్వకుండా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. కానీ నాకు నిజమైన ట్రోఫీ నా ఆటగాళ్లే మరియు సహాయక సిబ్బందేనని భావోద్వేగంగా చెప్పారు.
భారత్, పాకిస్థాన్‌తో టోర్నమెంట్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి, మూడింటినీ గెలుచుకుంది. ఫైనల్‌కు ముందు, గ్రూప్ దశలో 7 వికెట్లతో, సూపర్ 4లో 6 వికెట్లతో భారత్ విజయం సాధించింది. నఖ్వీ నుండి ట్రోఫీని స్వీకరించడానికి జట్టు నిరాకరించినందుకు సంబంధించి.. “మేము ఈ నిర్ణయాన్ని మైదానంలోనే తీసుకున్నాము. బీసీసీఐ లేదా మరెవరూ మమ్మల్ని ఇలా చేయమని చెప్పలేదు” అని సూర్యకుమార్ స్పష్టం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..