Asia Cup 2025 : మళ్లీ మళ్లీ అదే చేస్తున్న టీమిండియా.. ఫైనల్లో ఆ తప్పు చేయకుంటే ఆసియా కప్ మనకే..!

Asia Cup 2025 : మళ్లీ మళ్లీ అదే చేస్తున్న టీమిండియా.. ఫైనల్లో ఆ తప్పు చేయకుంటే ఆసియా కప్ మనకే..!


Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా.. గ్రూప్ దశలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిచింది. సూపర్-4లోనూ పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లపై వరుస విజయాలు సాధించి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అయితే, వరుసగా రెండు సూపర్-4 మ్యాచ్‌లలో టీమిండియా చేసిన ఒక పెద్ద పొరపాటు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. అదే.. దారుణమైన ఫీల్డింగ్. ఈ ఫీల్డింగ్ వైఫల్యం ఫైనల్‌లో కప్పును దూరం చేయవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

పాకిస్థాన్‌పై ఐదు క్యాచ్‌లు డ్రాప్

ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ బలంగా ఉన్నప్పటికీ, ఫీల్డింగ్ మాత్రం సూపర్-4 దశలో తీవ్రంగా నిరాశపరిచింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు చూపించిన దారుణమైన ఫీల్డింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 5 క్యాచ్‌లు వదిలేసింది. అంతేకాకుండా, ఒక సులువైన రనౌట్ అవకాశాన్ని కూడా కోల్పోయింది. అంటే, వికెట్లు తీయడానికి వచ్చిన ఆరు అవకాశాలను చేజార్చుకోవడం భారత జట్టు స్థాయికి తగని విషయం.

బంగ్లాదేశ్‌పై కూడా అదే పొరపాటు

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జరిగింది ఏదో ఒక్క మ్యాచ్‌కే పరిమితం అనుకుంటే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా టీమిండియా ఫీల్డింగ్‌లో ఎలాంటి మెరుగుదల చూపించలేదు. బంగ్లాదేశ్‌పై కూడా భారత ఆటగాళ్లు 5 క్యాచ్‌లు వదిలేశారు. ఇందులో విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ ఐదు క్యాచ్‌లలో నాలుగు క్యాచ్‌లు కేవలం ఒకే బ్యాట్స్‌మెన్ సైఫ్ హసన్ ఇచ్చినవే. సైఫ్ హసన్ వేగంగా 69 పరుగులు చేసి బంగ్లాదేశ్‌కు మంచి స్కోరు అందించడంలో ఈ లైఫ్ లైన్లు కీలకమయ్యాయి.

సైఫ్ హసన్‌కు వరుస లైఫ్ లైన్లు

మొదట 40 పరుగుల వద్ద అక్షర్ పటేల్ తన బంతికి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఓవర్‌లో 65 పరుగుల వద్ద శివమ్ దూబే సులువైన క్యాచ్‌ను జారవిడిచాడు. వెంటనే, 66 పరుగుల వద్ద వికెట్ కీపర్ సంజు శాంసన్ సైఫ్ హసన్‌కు మరో లైఫ్ లైన్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే 67 పరుగుల వద్ద అభిషేక్ శర్మ కూడా క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. చివరి ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ నసుమ్ అహ్మద్ క్యాచ్‌ను కూడా వదిలేశాడు.

ఇలా, ఐదు క్యాచ్‌లు డ్రాప్ చేసినప్పటికీ అదృష్టవశాత్తు టీమిండియా ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. కానీ ఫైనల్‌ వంటి కీలక మ్యాచ్‌లలో ఇలాంటి చిన్న పొరపాటు కూడా జట్టుకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. ప్రపంచ స్థాయి జట్టుగా పేరున్న టీమిండియా ఫైనల్‌లో ఈ తప్పులను సరిదిద్దుకోకపోతే ఆసియా కప్ టైటిల్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *