Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్ ఓటమి తర్వాత పాక్ జట్టు షాకింగ్ నిర్ణయం.. ఉగ్రవాద కుటుంబాలకు మ్యాచ్ ఫీజు

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్ ఓటమి తర్వాత పాక్ జట్టు షాకింగ్ నిర్ణయం..  ఉగ్రవాద కుటుంబాలకు మ్యాచ్ ఫీజు


Asia Cup 2025 : ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్, పాకిస్థాన్‌పై వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచి హ్యాట్రిక్ సాధించింది. అయితే, ఈ ఓటమి అనంతరం పాకిస్థానీ జట్టు ఒక అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సింధూర్‎లో హతమైన ఉగ్రవాదుల కుటుంబాలకు తమ ఫైనల్ మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ షాకింగ్ విషయాన్ని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఈ ప్రకటన అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. “ఒక జట్టుగా మా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఫీజును భారతదేశం చేసిన దాడులలో ప్రభావితమైన ప్రజలు, పిల్లల కుటుంబాలకు విరాళంగా ఇస్తున్నాము” అని అన్నారు. అయితే, ఆపరేషన్ సింధూర్‎లో కేవలం ఉగ్రవాదులు మాత్రమే హతమయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందా అనే తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్థాన్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసే అవకాశం ఉంది.

ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా.. సల్మాన్ ఆగా భారత జట్టు ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేసుకోకపోవడం, ఇతర వ్యవహారాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సల్మాన్ ఆగా మాట్లాడుతూ.. “మాతో షేక్ హ్యాండ్ చేసుకోకపోవడం ద్వారా వారు మమ్మల్ని అవమానించడం లేదు.. కానీ క్రికెట్‌ను అవమానిస్తున్నారు” అని అన్నారు. “భారతదేశం ఈ టోర్నమెంట్‌లో చేసింది చాలా నిరాశపరిచింది” అని ఆగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ఆసియా కప్ ట్రోఫీతో ఒంటరిగా ఫోటోలు దిగడానికి వెళ్లామని, ఎందుకంటే తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రెజెంటేషన్ వేడుకలో తాము అక్కడే నిలబడి తమ మెడల్స్ తీసుకున్నామని చెప్పారు.

సల్మాన్ ఆగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యకుమార్ యాదవ్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత సమస్య లేదని, ఒకవేళ ఇది అతని నిర్ణయం అయితే, తనతో షేక్ హ్యాండ్ చేసేవాడని ఆయన అభిప్రాయపడ్డారు. “సూర్య టోర్నమెంట్ ప్రారంభంలో నాతో వ్యక్తిగతంగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. టోర్నమెంట్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ, మేము రిఫరీ మీటింగ్‌లో కలిసినప్పుడు కూడా అతను నాతో షేక్ హ్యాండ్ చేసుకున్నాడు. కానీ, కెమెరాల ముందు ఉన్నప్పుడు మాత్రం మాతో షేక్ హ్యాండ్ చేసుకోవడం లేదు. అతను ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇది అతనిపై ఆధారపడి ఉంటే, అతను నాకు షేక్ హ్యాండ్ ఇచ్చే వాడు” అని సల్మాన్ ఆగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

క్రికెట్ ఫ్యాన్‌గా తాను ఈ సంఘటనను చూసినప్పుడు చాలా బాధ కలిగిందని సల్మాన్ ఆగా తెలిపారు. “నేను కేవలం పాకిస్తాన్ కెప్టెన్ మాత్రమే కాదు, క్రికెట్ అభిమానిని కూడా. భారత్ లేదా పాకిస్తాన్‌లో ఒక పిల్లవాడు మ్యాచ్ చూస్తున్నప్పుడు, మేము వారికి మంచి సందేశం ఇవ్వడం లేదు. ప్రజలు మమ్మల్ని ఆదర్శంగా చూస్తారు. కానీ, ఇలా ప్రవర్తిస్తే వారికి నిరాశే మిగులుతుంది” అని ఆయన అన్నారు. ప్రెజెంటేషన్ సెరెమనీలో జరిగిన ఈ సంఘటన, గతంలో జరిగిన అన్ని సంఘటనలకు పర్యవసానమే అని పేర్కొన్న ఆయన, దీనిపై తనను కాకుండా దీనికి బాధ్యులైన వారిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *