Ashwini Vaishnaw: జోహోకి మారిన అశ్విని వైష్ణవ్.. స్వదేశీ సాఫ్ట్‌వేర్‌కు ప్రోత్సాహం..

Ashwini Vaishnaw: జోహోకి మారిన అశ్విని వైష్ణవ్.. స్వదేశీ సాఫ్ట్‌వేర్‌కు ప్రోత్సాహం..


డిజిటల్ ఇండియాలో భాగంగా స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తన అధికారిక పనులకు ఇకపై విదేశీ సాఫ్ట్‌వేర్‌లను కాకుండా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన జోహో ప్లాట్‌ఫామ్‌ను వాడనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియాలో వెల్లడించారు.

“నేను జోహోకి మారుతున్నాను – డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్ల కోసం మన స్వదేశీ ప్లాట్‌ఫామ్ ఇది” అని ఆయన తన పోస్ట్‌లో తెలిపారు. విదేశీ సాఫ్ట్‌వేర్ సంస్థలకు దీటుగా భారతీయ కంపెనీలు సృష్టించిన టెక్నాలజీని ప్రోత్సహించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

జోహో ప్లాట్‌ఫామ్ ప్రత్యేకతలు..

జోహో అనేది చెన్నైకి చెందిన ఒక ప్రముఖ టెక్నాలజీ సంస్థ. ఈ ప్లాట్‌ఫామ్‌లో డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్లు వంటి ఆఫీస్ అప్లికేషన్స్‌తో పాటు అనేక వ్యాపార నిర్వహణ సాఫ్ట్‌వేర్లు కూడా ఉన్నాయి. సుమారు 180కి పైగా దేశాలలో లక్షలాది మంది వినియోగదారులు జోహో సేవలను ఉపయోగిస్తున్నారు. ఇది మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలకు గట్టి పోటీనిస్తోంది. జోహో సంస్థకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. అది తమ యూజ్ల డేటాను చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. యాడ్స్ కోసం డేటాను అమ్మకుండా వినియోగదారుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.

వికసిత్ భారత్ 2047

పండుగ సీజన్‌లో దేశీయంగా తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు లేఖ రాసిన తర్వాత కేంద్ర మంత్రి ఈ పిలుపునిచ్చారు. ఈ చర్యను మోదీ ‘వికసిత్ భారత్ 2047’ దార్శనికతకు అనుసంధానించారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా స్థానిక చేతివృత్తులు కార్మికులు, పరిశ్రమలకు కూడా సహాయపడుతుందని మోడీ తన లేఖలో స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశీయంగా అభివృద్ధి చెందిన టెక్నాలజీ పట్ల విశ్వాసం, మద్దతు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ చర్యతో ఇతర ప్రభుత్వ శాఖలు కూడా స్వదేశీ ప్లాట్‌ఫామ్‌ల వాడకాన్ని పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది భారతదేశ డిజిటల్ స్వావలంబనలో ఒక కీలక ఘట్టంగా నిలవనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *