ఎండాకాలం ప్రారంభంలోనే భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలోనే మాడు పగిలే ఎండలు జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక సమ్మర్ స్టార్టింగ్లోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని, దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్లో పేర్కొందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
మార్చిలో ఈ జిల్లాలో మాడు పలిగే ఎండలు
ఇక మార్చి నెలలో ఏపీలోని శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉందని అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కవ రోజులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వెల్లడించారు.
ఏప్రిల్ మేలో ఈ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు
మార్చి నుంచి మే నెల వరకు చూసుకుంటే శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిపారు. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ఇదిలా ఉండగా అటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటు తెలంగాణలోనూ మార్చి నుంచి మే నెల వరకు దాదాపు అన్ని జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అధికారులు పేర్కొన్నారు. ఈ ఎండల దృష్ట్యా జనాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.