హైదరాబాద్, సెప్టెంబర్ 27: వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరడంతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్(గండిపేట) నిండుకుండలా ఉన్నాయి. దీంతో ఈ రెండు జంట జలాశయాల గేట్లు తెరచి వరదను దిగువకు వదలడంతో మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర, మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది.
దీంతో ఎంజీబీఎస్‌లోకి వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. మూసీ వరద నీరు భారీగా ఎంజీబీఎస్ బస్డాండ్‌లోకి చేరింది. చుట్టూ జలదిగ్బంధం కావడంతో వేల మంది ప్రయాణికులు బస్డాండ్‌లో చిక్కుకుపోయారు. మూసీ అంతకంతకు మహోగ్రరూపం దాల్చడంతో సమీప కాలనీల్లో జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత ఒకేసారి 35 వేల క్యూసెక్కుల నీటిని వదలడంతో కనీవినని రీతిలో వరద పోటెత్తింది. ఇంత ప్రవాహం మూసీలో రావడం ఇదే తొలిసారి.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తా కథనాల కోసం ఇక్కడ వీక్షించండి.