అమరావతి, సెప్టెంబర్ 27: రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవు. 2 పాలిటెక్నిక్ కళాశాలలకు కూటమి ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిలో అయిదు పాలిటెక్నిక్ లకు (చోడవరం, పొన్నూరు, బేతంచర్ల, మైదుకూరు, గుంతకల్లు), భూములు కేటాయించాం, మరో మూడింటికి (మచిలీపట్నం, కెఆర్ పురం, అనపర్తి)లకు భూములు కేటాయించాల్సి ఉంది. కేంద్రప్రభుత్వంతో చర్చించి రాష్ట్రప్రభుత్వం, ఎంపి లాడ్స్, సిఎస్ఆర్ నిధులను అనుసంధానించి సొంత భవనాల నిర్మాణం పూర్తిచేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించే ప్రతిపాదనలపై అసెంబ్లీ సమావేశాల ఏడోరోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, అయితాబత్తుల ఆనందరావు, మద్దిపాటి వెంకటరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు.
బి.మఠం నవోదయ స్కూలును తాత్కాలిక భవనాల్లో ప్రారంభించే విషయమై కేంద్ర మంత్రితో మాట్లాడతాం. కోనసీమ హయ్యర్ ఎడ్యుకేషన్ లో వెనుకబడి ఉంది. అందుకే అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేశాం, త్వరలోనే పూర్తిచేస్తాం. కోనసీమలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసే అంశంపై చర్చిస్తాం. పాలిటెక్నిక్ లలో అడ్మిషన్లు 70శాతంగా ఉన్నాయి. కన్వెన్షనల్ కోర్టులకు ఎవరూ రావడం లేదు. కోర్సులను రీడిజైన్ చేయాల్సి ఉంది. మార్కెట్ లింక్, ఓరియంటెడ్ కోర్సులను తీసుకురావాల్సి ఉంది. వచ్చే అకడమిక్ ఇయర్ లో లేటెస్ట్ కోర్సులను తీసుకువచ్చి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ చెప్పారు.
పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ… మైదుకూరు పాలిటెక్నిక్ కళాశాలలో 540 మంది కెపాసిటీ ఉండగా, 120మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. ఇక్కడ నూరుశాతం టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. సొంత భవనం ఏర్పాటుచేస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా బ్రహ్మంగారిమఠం మండలంలో నవోదయ స్కూలు మంజూరైంది. అక్కడ ఖాళీగా ఉన్న భవనంలో ఈ సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులు చదువుకోవడానికి అవకాశమేర్పడుతుందని అన్నారు. అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ… అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలు కోనసీమ దీవిలో ఉన్నాయి. ఇందులో 3 అసెంబ్లీలు పక్కపక్కనే ఎస్సీ నియోజకవర్గాలు. ఇక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్ లేకపోవడం వల్ల విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేకపోతున్నారు. ఓఎన్ జిసి, గెయిల్, రిలయన్స్ కంపెనీల కార్యకలాపాలు కొనసాగుతున్నారు. విద్యాపరంగా మాది వెనుకబడిన జిల్లా. మొన్ననే డిగ్రీ కళాశాల ఇచ్చారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కూడా మంజూరు చేస్తే యువతకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ… 2024-25లో పాలిటెక్నిక్ కళాశాలల్లో 94శాతం సక్సెస్ రేటు ఉంది. ఇంత మంచి ఫలితాలు వస్తున్న పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్లు అనుకున్న స్థాయిలో ఉండటం లేదు. అడ్మిషన్లు పెంచగలిగితే విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.