Andhra Pradesh: శ్మశాన వాటికలో పెద్ద ఎత్తున మంటలు.. ఏంటా అని స్థానికులు దగ్గరికెళ్లి చూడగా..

Andhra Pradesh: శ్మశాన వాటికలో పెద్ద ఎత్తున మంటలు.. ఏంటా అని స్థానికులు దగ్గరికెళ్లి చూడగా..


Andhra Pradesh: శ్మశాన వాటికలో పెద్ద ఎత్తున మంటలు.. ఏంటా అని స్థానికులు దగ్గరికెళ్లి చూడగా..

సాధారణంగా స్మశానవాటిక అంటేనే భయం ఉంటుంది. అక్కడ అడుగు పెట్టడానికి కూడా ఎవరైనా వెనుకాడతారు. కానీ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఒక శ్మశానవాటిక మాత్రం వరుసగా అసాంఘిక శక్తుల దాడులకు గురవుతోంది. అసలు వారి ఉద్దేశ్యం ఏమిటో ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాక స్థానికులు తలలు పట్టుకుంటున్నారు. స్థానిక విశ్వబ్రాహ్మణ శ్మశానవాటికలో గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. ఎండల తీవ్రతకు తోడు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో శ్మశానంలోని చెట్లు, గడ్డి భారీగా తగులబడ్డాయి. మంటలు అదుపు తప్పి పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల వైపు వ్యాపించడంతో సమీపంలోని ఇళ్ల నివాసితులు, రైతులు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సమయానికి ఫైర్ ఇంజిన్ రాకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

వరుస దాడులు.. విగ్రహాల ధ్వంసం

ఈ శ్మశానవాటికపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ దుండగులు ఇక్కడ వికృత చేష్టలకు పాల్పడ్డారు. సమాధులపై భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసుకున్న నంది విగ్రహాలను సైతం కనికరం లేకుండా ధ్వంసం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఒకవైపు విగ్రహాల కూల్చివేత, మరోవైపు చెట్లకు నిప్పు పెట్టడం చూస్తుంటే.. ఇది ఎవరో కావాలనే కుట్రపూరితంగా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ‘‘చనిపోయిన వారిని సమాధి చేసిన చోట ఇలాంటి అరాచకాలు చేయడం దారుణం. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాదు, ఎవరో కావాలని చేసిన పనే’’ అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైటెన్షన్ వైర్ల కింద ఇలాంటి చర్యలకు పాల్పడటం వల్ల భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.

పోలీసులు ఈ ఘటనపై లోతైన విచారణ జరిపి.. నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ దాడుల వెనుక ఏదైనా ముఠా ఉందా? లేక స్థానికంగా అలజడి సృష్టించే ప్రయత్నమా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *