ఇంకెన్నాళ్లీ కష్టాలు.. అభివృద్ధి అంటే పట్టణాలు, నగరాలేనా? మారుమూల పల్లెలు, గూడాలు, తండాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. రోడ్డు మార్గం అందని కలగానే మిగులుతోంది. పురిటి నొప్పులు వచ్చినా.. అనారోగ్యం పాలైన డోలియే దిక్కవుతోంది. ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక, డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది. తాజాగా అల్లూరి జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
అల్లూరి జిల్లా ఏజెన్సీలో గిరిజనుల కష్టాలు అన్ని ఇన్నీ కావు.. కనీస సౌకర్యాలు వాళ్లకు ఆమడ దూరం. మారుమూల ప్రాంతంలో గిరిజనులకు అయితే ఆ కష్టాలు మామూలుగా ఉండవు. రోగం వచ్చినా, అత్యవసర పరిస్థితులు ఎదురైనా ప్రాణాలు పోయేంత పరిస్థితి. వర్షాల సీజన్లో అయితే.. ఇక చెప్పనవసరం లేదు..! ఇలా ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లకపోతే ఆమె ప్రాణాల పైకి వస్తుంది. వెళ్దామంటే వాన, ఆపై రహదారి లేదు. ఉదృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు నుంచి దాటి వెళ్లాల్సిందే.. దీంతో గిరిజనలు సాహసమే చేశారు.. ప్లాస్టిక్ కుర్చీకి వెదురు కర్రలు కట్టి.. వాగు దాటించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం మండలంలోని జామిగూడ గుంజివాడ గ్రామాల మధ్య మత్వ గెడ్డపై వంతెన లేదు. దీంతో గెడ్డ అవతల ఉన్న గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. గుంజివాడ గ్రామానికి చెందిన నిండు గర్భిణి కౌసల్యకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. కౌసల్యను డోలీలో గెడ్డ దాటించడానికి కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఒకరిద్దరితో సాధ్యం కాని పని అది. దీంతో స్థానికులంతా ఏకమయ్యారు. ఆమెను గడ్డ దాటించేందుకు అష్ట కష్టాలు పడ్డారు. నడవలేని స్థితిలో ఉండడంతో.. ప్లాస్టిక్ కుర్చీని వెదురు కర్రలకు కట్టి డోలీలా తయారు చేసి ఉదృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటించారు. అతికష్టం మీద అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు.
అక్కడి నుంచి ముంచంగిపుట్టు సీహె చ్సీకి తరలించగా వైద్యుల పర్యవేక్షణలో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మత్స్య గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు డోలీ మోతలు తప్పడం లేదని గుంజివాడ, చింతలవీధి, తారాబు, జడిగూడ, గబ్బర్ల, సరిగిగూడ గ్రామాలకు చెందిన గిరిజనులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..