ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనే చెబుతోంది. పత్తికొండ మండలం చక్రాల గ్రామంలో కేవలం ఆస్తి కోసం కన్న బంధువులు, ప్రాణ స్నేహితుడు కలిసి ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. చక్రాల గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డి ఎద్దుల పోటీలకు ఎద్దులను తరలించే బండ్లకు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతనికి గ్రామంలో 14 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని అమ్ముకోవాలనుకున్నప్పుడు పద్మనాభరెడ్డి చిన్నాన అయిన రాజశేఖర్ రెడ్డి ఆ స్థలాన్ని తనకు అమ్మమని అడిగాడు. అయితే కుటుంబ తగాదాల కారణంగా పద్మనాభరెడ్డి అందుకు నిరాకరించాడు. తన బంధువైన రాజశేఖర్ రెడ్డికి కాకుండా అదే గ్రామానికి చెందిన గొల్ల రంగడికి ఆ స్థలాన్ని అమ్మాడు.
సుపారీ తీసుకుని స్నేహితుడి ద్రోహం
తనకు స్థలం అమ్మలేదన్న కోపంతో రాజశేఖర్ రెడ్డి పద్మనాభరెడ్డిపై పగ పెంచుకున్నాడు. తన బావమరిది రామ్ కొండను గ్రామానికి పిలిపించుకొని పద్మనాభరెడ్డిపై దాడి చేయించాడు. ఈ దాడిలో పద్మనాభరెడ్డి గాయపడ్డాడు. ఆ తర్వాత తన బంధువులపై ప్రతీకారం తీర్చుకుంటానని.. వారిని చంపుతానని పద్మనాభరెడ్డి అన్నాడు. ఈ మాటలు రాజశేఖర్ రెడ్డికి భయం పుట్టించాయి. దీంతో పద్మనాభరెడ్డిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పద్మనాభరెడ్డిని చంపడానికి రాజశేఖర్ రెడ్డి ఒక దారుణమైన ప్లాన్ వేశాడు. పద్మనాభరెడ్డికి చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితుడైన బోయ గంప అయ్యన్నను కలిశాడు. పద్మనాభరెడ్డి తమను చంపుతాడని.. అతన్ని చంపి ఇస్తే రూ.1.30 లక్షలు ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడు. డబ్బులకు ఆశపడ్డ అయ్యన్న స్నేహాన్ని మరిచి పద్మనాభరెడ్డిని చంపేందుకు ఒప్పుకున్నాడు.
హత్య, మృతదేహం మాయం
పథకం ప్రకారం.. బోయ గంప అయ్యన్న పద్మనాభరెడ్డిని పొలం దగ్గరికి వెళ్దామని నమ్మబలికి వెంట తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తర్వాత అయ్యన్న తన సుపారీ బృందంతో (శ్రీరాముడు, సిద్ధరాముడు, రాజశేఖర్ రెడ్డి) కలిసి పద్మనాభరెడ్డిని చంపాడు. హత్య తర్వాత రాజశేఖర్ రెడ్డికి ఈ విషయం చెప్పాడు. డోన్-ప్యాపిలి హైవే దగ్గర ఉన్న వెంగళంపల్లి చెరువులో మృతదేహాన్ని పడేయమని రాజశేఖర్ రెడ్డి చెప్పగా సుపారీ బృందం ఒక సంచిలో పద్మనాభరెడ్డి మృతదేహాన్ని ఉంచి.. రాయి కట్టి చెరువులో వదిలేశారు.
అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు
మూడు నెలల తర్వాత పద్మనాభరెడ్డిపై ఉన్న కేసుల విచారణ కోసం పోలీసులు అతని ఇంటికి వెళ్లగా పద్మనాభరెడ్డి భార్య శిరీష తన భర్త మూడు నెలలుగా ఇంటికి రాలేదని చెప్పింది. సాధారణంగా ఎద్దుల బండి డ్రైవర్‌గా వెళ్తే 15-20 రోజులు బయట ఉండేవారని కానీ ఇంత కాలం ఎప్పుడూ లేదని శిరీష పోలీసులకు చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించారు.
ఈ కేసులో మొత్తం 14 మందిపై కేసు నమోదు చేయగా, ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన 11 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పత్తికొండ టౌన్ సీఐ జయన్న తెలిపారు. నమ్మిన స్నేహితుడే ద్రోహం చేసి, కన్న బంధువులే హతమార్చడం పద్మనాభరెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అతని భార్య శిరీష, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.