Andhra Pradesh: భలే ఆలోచన.. ఏపీ తీర ప్రాంతానికి తాటి కవచం..

Andhra Pradesh: భలే ఆలోచన.. ఏపీ తీర ప్రాంతానికి తాటి కవచం..


సముద్రం అంటే సాగర హోరు, కెరటాల జోరు, పర్యాటకుల హుషారే కాదు..నష్టాలూ ఉన్నాయి. వర్షా కాలంలో తరచూ ఏర్పడే తుపానులు.. తీరప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అలలు విరుచుకుపడి ఏటా తీరప్రాంత గ్రామాలు నష్టపోతున్నాయి. ఇళ్లు, భూములు, ఆస్తులు భారీగా దెబ్బతింటున్నాయి. ఈ నష్టాలను నివారించేందుకు.. తుపానుల సమయంలో తీరంలో మట్టికోతను నివారించేందుకు, తీర ప్రాంత గ్రామాలు గాలుల తాకిడిని తట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కోసం తీర ప్రాంతం వెంట గ్రేట్‌ గ్రీన్‌వాల్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తీరం కోతకు గురికాకుండా సహజ రక్షణగా నిలిచేలా తాటిచెట్లను విరివిగా పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలుచోట్ల పనులు మొదలయ్యాయి.

అటవీ శాఖ ఆధ్వర్యంలో ‘గ్రేట్ గ్రీన్‌వాల్‌’ కింద కాకినాడలో తీరంలో కూడా గత ఏడాది వనాల పెంపకం ప్రారంభించింది ప్రభుత్వం. అటవీశాఖ అధికారులు సముద్రం మధ్యలో ఉన్న హోప్ ఐలాండ్‌కు వెళ్లి చాలాచోట్ల తాటి టెంకలు పాతిపెట్టే కార్యక్రమాన్ని విస్తృతంగా చేస్తున్నారు. ఇప్పటివరకూ సుమారు 25 వేలు తాటిటెంకలు నాటగా అందులో 70 శాతం పైగా మొక్కలు మొలకెత్తాయి అని అధికారులు చెబుతున్నారు.

అయితే ఎన్నో రకాల చెట్లు ఉండగా తీరాన్ని రక్షించేందుకు తాటి చెట్లే ఎందుకు అంటే దానికి అనేక సమాధానాలు ఉన్నాయి. తాటి చెట్లు అన్ని రకాల ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. 40 నుండి 50 అడుగుల ఎత్తు వరకు ఈజీగా పెరుగుతాయి. తుపాను సమయంలో గాలుల నుంచి తీరానికి ఈ చెట్లు రక్షణ కవచంగా నిలుస్తాయి. ఈ చెట్ల వేర్లు ఇసుకను బలంగా పట్టుకుని ఉంచుతాయి. అలలు వచ్చినప్పుడు ఇసుక వదిలిపోకుండా కాపాడతాయి. తాటి చెట్ల నుంచి సుమారు 36 రకాల ఉత్పత్తుల తయారీకి అవకాశం ఉంటుంది.  ఈ తాటి ఉత్పత్తులతో స్థానికులకు, కల్లుగీత కార్మికులకు ఉపాధి లభిస్తుంది.ఈ చెట్లు అనేక రకాల పక్షులకు ఆవాసంగా ఉంటాయి..దాంతో జీవ వైవిద్యం కూడా పెరుగుతుంది

సునామీ వంటి ప్రకృతి విపత్తులు వస్తే మొదట నష్టపోయేది తీర గ్రామాలే. వారు భద్రంగా బతకాలంటే తీరం పటిష్టంగా ఉండాలి. తీరం ధృడంగా ఉండాలంటే సముద్రం అంచు పొడవునా చెట్లు ఉండాలి. గతంలో సరుగుడు, తాటి వృక్షాలు తీరంలో గుబురుగా కనిపించేవి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రోజురోజుకూ తీరంలో ఆక్రమణలు పెరుగుతున్నాయి. దీంతో విపత్తుల సమయంలో తీరానికి రక్షణ కరువవుతోంది. ఆ పరిస్థితులను మార్చాలని భావిస్తోంది ప్రభుత్వం. అందులో మొదటి అడుగుగా తీరానికి తాటి చెట్లతో రక్షణ కవచం ఏర్పాటు చేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *