అల్లూరి జిల్లా అరకు ఏజెన్సీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలువ పూలు కోసేందుకు వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి నుంచి వెళ్లిన యువకుడు.. ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి కుటుంబం ఆందోళన చెందింది. వెతికేసరికి గుండె పగిలే ఘటన కళ్ళ ముందు కనిపించింది. డుంబ్రిగూడ మండలం నందివలసలో ఘటన జరిగింది.
చెరువులో కలువ పూలు కోసేందుకు వెళ్లిన గిరి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డుంబ్రిగూడ మండలం అరమ పంచాయతీ డుంబ్రివలస గ్రామానికి చెందిన పాంగి సంజీవరావు.. కలువ పూలు కోయాలని అనుకున్నాడు. గ్రామానికి సమీపంలోని నందివలస చెరువులో కలువ పూలు తెంచేందుకు దిగాడు. చెరువులోకి వెళ్ళగానే ఊబిలో చిక్కుకున్నాడు. కాళ్ళు ఊబిలో చిక్కుకుని బయటకు రాలేకపోయాడు.
ఇదిలావుంటే ఇంటి నుంచి వెళ్లిన ఆ యువకుడు.. ఎంతసేపైనా తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కంగారుపడ్డారు. ఊరంతా గాలించారు. ఎక్కడా ఆచూకీ లేదు. చివరికి చెరువు గట్టున దుస్తులు కనిపించాయి. గుండెలు పట్టుకుని.. చెరువులో గాలించారు. గుండె పగిలే అదృశ్యం వాళ్లకు కనిపించింది. ఊబిలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారాడు సంజీవరావు. గ్రామస్తులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. చేతికంది వచ్చిన యువకుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలోకి వెళ్లింది. సంజీవరావు తల్లి చిన్నప్పుడే మృతి చెందగా.. తండ్రి అప్పలస్వామి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..