కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 11ఏళ్ల బాలుడు బలవన్మరణం అందరినీ కలచివేసింది. అతిగా సెల్‌ఫోన్ చూస్తున్న బాలుడిని మందలించి, తల్లితండ్రులు సెల్‌ఫోన్ లాక్కున్నారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన బాలుడు.. బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఎమ్మిగనూరు వెంకటాపురం కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్నా శేఖర్, శారదాలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం ఉన్నారు. శేఖర్ ఎమ్మిగనూరు పట్టణంలో ఓ కిరాణా దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే దసరా సెలవులు కావడంతో ఇంట్లో ఉన్న కుమారుడు పవన్ (11) అతిగా సెల్‌ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. అది గమనించిన తల్లితండ్రులు శేఖర్, శారదా బాలుడిని మందలించారు. దీంతో తీవ్ర మనప్తాపం చెందిన బాలుడు బాత్రూంలో వెళ్లి గడియ వేసుకున్నాడు.
ఎంతకు బాలుడు పవన్ బయటకు రాకపోయేసరికి తల్లిదండ్రులు కంగారుపడ్డారు. వెంటనే బాత్రూం తలుపును పగలకొట్టిన చూశారు. లోపల ఉరి వేసుకుని బాలుడు పవన్ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే బాలుడిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించగా అక్కడ, వైద్యులు పరీక్షించి బాలుడు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..