
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం మక్కువలోని సువర్ణముఖి నది వంతెన సమీపంలో ఉన్న చికెన్ సెంటర్‌లోకి ఒక భారీ కొండచిలువ ప్రవేశించింది. అకస్మాత్తుగా వచ్చిన ఆ పాము అక్కడే ఉన్న రెండు కోళ్లను అమాంతం మింగేసింది. ఆ తరువాత మరో కోడిని చుట్టేసి చంపే ప్రయత్నం చేసింది. దీంతో కోళ్లు ఒక్కసారిగా బిగ్గరగా అరవడంతో మొత్తం కోళ్లఫారంలో కలకలం రేగింది. ఆ శబ్దం విన్న షాపు యాజమాని ఫారం లోపలకి వెళ్లి చూసే సరికి 15 అడుగుల పొడవైన కొండచిలువ కోళ్ల పై దాడి చేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే అతను స్థానికులను అప్రమత్తం చేశారు. కొంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి కొండచిలువను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే కొండచిలువ వారిపై దాడికి యత్నించింది. అయితే మనుషులను కూడా మింగే స్వభావం ఉన్న కొండచిలువ కావడంతో అంతా హడలిపోయారు. కొంతసేపు అంతా భయానకంగా మారింది. చివరికి అందరూ కలిసికట్టుగా ఆ పామును హతమార్చారు.
ఈ ఘటన చోటుచేసుకున్న వెంటనే ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అంత పెద్ద కొండచిలువను ప్రత్యక్షంగా చూసేందుకు తరలివచ్చారు. అయితే ఇంత భారీ పాము జనావాసంలోకి రావడం అందరినీ తీవ్రంగా భయాందోళనకు గురి చేసింది. ఇలాంటి సంఘటనలు తరచుగా జరగకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సాలూరు ప్రాంతంలో ఇటీవల ఏజెన్సీ నుంచి వన్యప్రాణులు గ్రామాల వైపు వస్తున్న సంఘటనలు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన మరల వన్యప్రాణుల రక్షణ, గ్రామాల భద్రతపై చర్చకు దారితీసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.