గోదావరి జిల్లాల్లో అమితంగా ఇష్టపడే చీరమేను యానాం మార్కెట్లో సందడి చేసింది.. పులస చేప సీజన్ తరువాత వచ్చే చీరమేనును మాంసం ప్రియులు యమ ఇష్టంగా తింటారు. యానాం మార్కెట్లో బకెట్ చీరమేను వేలంపాటలో 28 వేలు పలకడం గమనార్హం. సేరు(సుమారు కేజీ) 3,000 రూపాయల వరకు పలుకుతుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే మాత్రమే లభించే చీరమేను కొనడానికి మాంస ప్రియులు ఎగబడ్డారు.
గోదావరి నదిలో మాత్రమే దొరికే అరుదైన చేప చీరమేను. పూర్వం మత్యకారులు అంగుళం సైజు పరిమాణం ఉండే చేపల్ని.. చీరలతో మత్యకారులు పట్టుకోవడంతో దీనికి చీరమేను అని పేరు వచ్చింది.. కాల క్రమేణా మత్యకారులు చీరమేనును పట్టుకోవడానికి ప్రత్యేక వలలు రూపొందించారు. ప్రతీ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రమే చీరమేను లభిస్తుంది. సముద్రం, గోదావరి కలిసే ప్రాంతాల్లో మాత్రమే అరుదైన చీరమేను చిక్కుతుంది. చీరమేనును మత్యకారులు గ్లాసు, సోల, తవ్వ, శేరు, కుంచె, బిందెలు, బకెట్లతో కొలిసి అమ్మకాలు సాగిస్తుంటారు. గోదావరి జిల్లా ప్రాంత వాసులకు మాత్రమే చీరమేనును ఎలా వండాలో తెల్సు. చీరమేనుతో గారెలు కూడా చేస్తారు. చింత చిగురు, మామిడికాయ, గోంగూర కలిపి కూర వండి లొట్ట లేసుకుని తింటారు గోదావరి జనాలు. చీరమేను ఎంత ధర అయినా వెచ్చించి కొనుగోలు చేసి దేశ, విదేశాల్లో ఉన్న వారి బంధువులకు పంపుతూ ఉంటారు. విశేషం ఏంటంటే.. చీరమేను కూడా పులస మాదిరిగానే గోదావరి జలాల్లోకి ఎదురీదుతూ వస్తుందట.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.