జీర్ణ సమస్యలు: బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేసినప్పటికీ అధికంగా తీసుకోవడం వల్ల రివర్స్ అవుతుంది. రోజుకు పరిమితికి మించి బాదం తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటిని మితంగా తీసుకోవడం శ్రేయస్కరం.
కిడ్నీలో రాళ్ల ప్రమాదం: బాదంపప్పులో ఆక్సలేట్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. శరీరంలో ఆక్సలేట్ పరిమాణం పెరిగితే, అది మూత్రపిండాల్లో పేరుకుపోయి రాళ్లుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు బాదానికి దూరంగా ఉండటం లేదా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
బరువు పెరిగే అవకాశం: బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని స్నాక్స్లాగా కుప్పలు కుప్పలుగా తింటే శరీరంలో కేలరీల శాతం పెరిగి, బరువు తగ్గడానికి బదులు పెరిగే అవకాశం ఉంటుంది. బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారు రోజుకు 5-10 పప్పులకు మించి తినకూడదు.
అలెర్జీల పట్ల అప్రమత్తత: కొంతమందికి నట్స్ అంటే అలెర్జీ ఉంటుంది. బాదం తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు, దురద, నోరు లేదా గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలెర్జీ ఉన్నవారు బాదం పప్పులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
విటమిన్-E – పోషకాల లోపం: బాదంలో విటమిన్-E సమృద్ధిగా ఉంటుంది. అయితే ఇది శరీరంలో ఎక్కువైతే రక్తం గడ్డకట్టే ప్రక్రియపై ప్రభావం చూపి, రక్తస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే బాదంలోని అధిక ఫైబర్ శరీరంలో కాల్షియం, ఇనుము, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణను అడ్డుకుంటుంది. దీనివల్ల మీరు మంచి ఆహారం తీసుకున్నా శరీరానికి పోషకాలు అందక లోపాలు ఏర్పడవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాల కోసం బాదం పప్పులను రోజుకు 10-15 మించకుండా తీసుకోవడం ఉత్తమం. వాటిని నేరుగా తినడం కంటే రాత్రిపూట నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం తొక్క తీసి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం కోసం తినే ఆహారం హానికరంగా మారకుండా చూసుకోవడం మన బాధ్యత..





