ఏఐ వచ్చాక ఏది నిజమైన ఫొటోనో, ఏది ఏఐ జనరేటెడ్ అనేది తెలియట్లేదు. ఏఐ ఉపయోగించి హీరోల నుంచి ప్రధాన మంత్రి వరకూ అందరి ఫొటోలను మార్ఫ్ చేస్తూ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. సరదాగా ఏఐను వాడడం పక్కన పెడితే దీనివల్ల కొన్ని సార్లు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏఐ వల్ల ప్రైవసీ కూడా ప్రమాదంలో పడుతోంది. అందుకే ఏఐ వాడకంపై కొన్ని నిర్థిష్టమైన రూల్స్ తీసుకోచ్చే పనిలో ఉంది భారత ప్రభుత్వం.
ఫేక్ న్యూస్ ను గుర్తించేలా..
ఏఐను ఉపయోగించి కంటెంట్ ను క్రియేట్ చేసేవారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్సులు అవసరం అని పార్లమెంటరీ ప్యానెల్ కొన్ని సూచనలు చేసింది. దీని గురించి కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ.. లోక్సభ స్పీకర్ కు ఒక ముసాయిదా నివేదికను సమర్పించింది. ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోలు క్రియేట్ చేసినప్పుడు ఆ వ్యక్తులు లేదా కంపెనీలను గుర్తించి విచారించడానికి వీలుగా ఒక చట్టపరమైన నియమాలను ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. అంటే ఇకపై ఏఐ ఆధారిత వీడియోలు, కంటెంట్ కు అనుమతులు తప్పనిసరిగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాల్లో చక్కర్లు కొట్టే ఫేక్ వార్తలు, ఫేక్ వీడియోలను అడ్డుకునేందుకే ఈ కొత్త రూల్ ను తీసుకురాబోతున్నట్టు సమాచారం.
లైసెన్స్ అంటే..
లైసెన్స్ అంటే.. ఇది వ్యక్తులకు ఇచ్చేది కాదు, ఏఐ టూల్స్ వాడి క్రియేట్ చేసిన కంటెంట్ కు ఏఐ జనరేటెడ్ అని ఒక లేబుల్ ఇవ్వబడుతుంది. ప్రస్తుతం ఏఐ వాడుతున్న క్రియేటర్లకు దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు. కాకపోతే ఏది ఏఐ ఏది ఒరిజినల్ అని జనానికి తెలిసే విధంగా ఏఐ కంటెంట్ కు ఒక లేబుల్ ఇవ్వబడుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ రూల్ చర్చల దశలో ఉంది. ప్రభుత్వం అంగీకారం తెలిపితే అమలు లోకి వస్తుంది.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..