
హైదరాబాద్, మార్చి 12: హైదరాబాద్ నగరంలో బాలల విద్యకు సరికొత్త రూపు దిద్దుకుంటోంది. చిన్నారులకు ఆడుతూ పాడుతూ నేర్పించే విధానంలో సాంకేతికతను జోడిస్తూ తొలి AI ఆధారిత అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభమైంది. నగరంలోని ఎసామియా బజార్ ప్రాంతంలో ఈ వినూత్న కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారుల ప్రాథమిక విద్యను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కృత్రిమ మేధస్సు సాంకేతికతను వినియోగించేలా ఈ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ కేంద్రంలో ఇంటరాక్టివ్ డిజిటల్ పరికరాలు, ఆటల రూపంలో బోధన విధానాలు, చిన్నారులకు అనువైన అభ్యాస వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పిల్లలు ఆసక్తిగా నేర్చుకునేలా సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఈ కేంద్రాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొన్నారు. చిన్నారుల విద్యలో సాంకేతికతను వినియోగించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని అంగన్‌వాడీ కేంద్రాలను ఈ విధంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ ప్రయోగాత్మక కేంద్రం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా AI ఆధారిత అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. చిన్నారులలో ఆసక్తిని పెంచుతూ, ఆడుతూ పాడుతూ నేర్పించే ఈ విధానం బాలల ప్రాథమిక విద్యకు కొత్త దారులు చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.