ప్రముఖ తెలుగు నటుడు జగపతిబాబు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. తన ఆర్థిక విషయాల గురించి, డబ్బు పట్ల తన వైఖరిని వివరించారు. సోషల్ మీడియాలో సినీనటుల ఆస్తుల విలువల గురించి జరుగుతున్న చర్చల నేపథ్యంలో.. ఆయన తన ఆర్థిక పరిస్థితిని వెల్లడించారు. తాను డబ్బును కేవలం ఒక సాధనంగా చూస్తానని అన్నారు. తనకు లెక్కలు, ఆస్తుల విలువల పట్ల ఎలాంటి ఆసక్తి లేదని తెలిపారు. అధిక ధనం కంటే కుటుంబం, ఆరోగ్యం, సంతోషం చాలా ముఖ్యం తన అభిప్రాయమన్నారు.
తన జీవితంలో డబ్బును ఎలా వృధా చేశాడో వివరిస్తూ.. దానధర్మాలు, కుటుంబ ఖర్చులు, వ్యసనాలు, మోసాల ద్వారా డబ్బును కోల్పోవడం జరిగిందని జగపతిబాబు చెప్పారు. కానీ ఆయన ఎవరినీ నిందించలేదు. తన తప్పులను గుర్తించి, అనుభవాలను పాఠాలుగా తీసుకున్నానని తెలిపారు. అత్యధిక డబ్బు సంపాదించాలనే లక్ష్యం తనకు లేదని, తన కుటుంబానికి జీవితకాలం సరిపడా ధనం ఉంటే చాలు అనేది తన ఆలోచన అని చెప్పారు. 30 కోట్లతో తన కుటుంబం జీవితకాలం హాయిగా జీవించవచ్చని లెక్కించానని.. ఆ డబ్బు వచ్చిన తర్వాత అదనపు ధనం కోసం ప్రయత్నించడం తనకు అవసరం లేదని చెప్పారు. జగపతిబాబు తన నిజాయితీతో అందరినీ ఆకట్టుకున్నారు. డబ్బు కంటే జీవితంలో సంతోషం, ప్రశాంతత చాలా ముఖ్యమని ఆయన వివరించారు. అయితే కొందరిలా తన డబ్బును జాగ్రత్త చేసుకునే ఉంటే.. ఇప్పటికి రూ. 1000 కోట్ల ఆస్తి ఉండేదని ఆయన అంగీకరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.