
స్కూలుకు వెళ్లే పిల్లల దగ్గరనుంచి ఆఫీసులకు వెళ్లే పెద్దవారి వరకు మధ్యాహ్న భోజనానికి వెరైటీ కూరలు వండటం కష్టం. అలాగనీ రోజూ ఒకేలా పోపు పెట్టిన అన్నమో కర్డ్ రైసో బాక్సుల్లోకి పెట్టలేం. ఇక టొమాటో రైస్ తిని తిని బోర్ కొట్టిన వారు కూడా ఉంటారు. అందుకే కాస్త వెరైటీగా టొమాటో మసాలా రైస్ చేసి పెట్టండి. ఈ రెసిపీ ఎంతో సులువు..
కావలసిన పదార్థాలు
ఉడికించిన అన్నం – 2 కప్పులు (పొడిపొడిగా ఉండాలి)
పెద్ద ఉల్లిపాయలు – 2
టమాటాలు – 6
పచ్చిమిర్చి – 3
పసుపు పొడి – చిటికెడు
కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా
ఆవాలు, మినప్పప్పు – అర టీస్పూన్ చొప్పున
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఉప్పు – సరిపడా
మసాలా పొడి 1: దాల్చిన చెక్క, లవంగం, యాలకులు – తలా 2, గసగసాలు – 2 టీస్పూన్స్, జీడిపప్పు – 6, నూనె – 1 టీస్పూన్.
మసాలా పొడి 2: ధనియాలు, కందిపప్పు – 2 టీస్పూన్స్ చొప్పున, ఎండుమిర్చి – 4, కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్స్, నూనె 1 టీస్పూన్.
తయారీ విధానం
పొడి సిద్ధం చేయాలి: పైన ఇచ్చిన రెండు రకాల మసాలా దినుసులను విడివిడిగా తీసుకుని, కొద్దిగా నూనె వేసి వేయించాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారుచేసి పక్కన పెట్టుకోవాలి.
ముక్కలు కోయాలి: ఉల్లిపాయ, కొత్తిమీర, టమాటాలను చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని మధ్యకు చీల్చి ఉంచాలి.
తాలింపు: బాణలిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయండి. ఆవాలు, మినప్పప్పు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.
టమాటా వేయాలి: ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత టమాటాలు వేసి కలపండి. అందులో ఉప్పు, పసుపు వేసి, టమాటాలు పూర్తిగా మెత్తగా ఉడికే వరకు వదకాలి.
కలపడం: ఈ టమాటా గుజ్జును చల్లారిన అన్నంలో వేయండి. దాంతో పాటు తయారుచేసిన రెండు మసాలా పొడులు, కరివేపాకు, కొత్తిమీర వేసి, అన్నం విరిగిపోకుండా మెల్లగా కలపండి.
రుచికరమైన స్పెషల్ టొమాటో రైస్ లంచ్ బాక్స్ కి సిద్ధం.