వేప: వేపను క్రిమిసంహారణిగా పరిగణిస్తారు. అప్పట్లో దోమలు, కీటకాలను తరిమికొట్టడానికి వేప ఆకులను కాల్చి పొగ పెట్టేవారు. మరికొందరూ దొమలు కరవకుండా ఉండేందుకు వేప నూనెను రాసుకునేవారు. కాబట్టి మీ ఇంట్లోకి దోమలు రాకుండా ఉండటాంటే మీ ఇంటి గుమ్మానికి వేప ఆకులను కట్టండి, లేదా ఇంటి ఆవరణలో వేప చెట్టును పెంచుకోండి
నిమ్మ గడ్డి: ఈ మొక్క దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని చాలా మంది నమ్ముతారు. నిమ్మ గడ్డి నూనెను దోమల నివారణ క్రీములు, దోమల నివారణ మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. నిమ్మ గడ్డి డెంగ్యూ వ్యాప్తి చేసే దోమల నుండి రక్షిణ కల్పిస్తుందని నమ్ముతారు.
రోజ్మేరీ: ఈ మొక్కలు నర్సరీలలో లభిస్తాయి. వీటిని ఇంటి గార్డెన్లో పెంచుకోవడం చాలా సులభం. ఈ మొక్క పువ్వుల వాసన ఘాటుగా ఉంటుంది. ఈ వాసనకు దోమలు మన ఇంటి పరిసరాలకు రాకుండా పారిపోతాయి. రోజ్మేరీ పువ్వులను ఇంట్లో పురుగుమందులుగా కూడా ఉపయోగించవచ్చు. రోజ్మేరీ పువ్వులను కొన్ని గంటలు నీటిలో నానబెట్టాలి. తర్వాత ఆ నీటిని ఇంటి చుట్టూ చిలకరించాలి. ఇలా చేయడం ద్వారా దోమలు మీ పరిసరాల్లోకి రాకుండా ఉంటాయి.
తులసి: దోమలను తరిమికొట్టడంలో తులసి మొక్కకూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే, ఆ స్థలంలో తులసి మొక్కను పెంచండి. వీటి వాసనకు దోమలు ఆ పరిసరాల్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా తులసిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి తలనొప్పి, గొంతు నొప్పి, జలుబుతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీరు తులసి ఆకులను నీటిలో మరిగించి తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
పుదీనా: దోమలను తరిమికొట్టడంలో పుదీనా కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ మొక్కను ఇంటి ప్రాంగణంలో, బాల్కనీలో, ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్క దోమల నుండి మాత్రమే కాకుండా ఇతర కీటకాలు, సాలెపురుగుల నుండి కూడా రక్షించడంలో సహాయపడుతుంది.