హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది నగరం కొత్తగా మరికొన్ని ఇందిరమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మోతినగర్, ఖైరతాబాద్ మింట్ క్యాంపస్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జోనల్ కమిషనర్ లు బోర్కడే హేమంత్ సహదేవ్ రావు , అనురాగ్ జయంతి, అదనపు కమిషనర్ లు రఘు ప్రసాద్, పంకజ, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఈ క్యాంటీన్ లలో లబ్ధిదారులకు సబ్సిడీతో రూ.5కే అల్పాహారం, రూ.5, భోజనం అందించబడుతుంది. జీహెచ్ఎంసీ ఒక్కో అల్పాహారం పై రూ.14, భోజనంపై రూ.24.83 ఖర్చు చేయనుంది. దీంతో ప్రతి లబ్ధిదారునికి నెలకు సగటున సుమారు రూ.3 వేల వరకు ఆర్థిక ప్రయోజనం కలగనుంది. వీటి నిర్వాహణ బాధ్యతను హరే కృష్ణ హరే రామ పౌండేషన్ వీటి చూస్తుంది. ఇందిరమ్మ క్యాంటీన్ ల ద్వారా ఉదయం అందించే అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో హైదరాబాద్ లో పేదలు, అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, అల్పదాయ వర్గాల వారు, నిరుద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
ఈ నూతన ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, ఎంపీ, ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ అధికారులు లబ్ధిదారులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు, లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గరీబి హటావో అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు ఇందిరమ్మ కృషి చేశారన్నారు. ప్రజల ఆశీస్సుల వల్ల ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. ఒక్క హైదరాబాద్ నగరంలోని 60 వేలకు పైగా రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించామన్నారు. ఇందిరమ్మ స్పూర్తిగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇందిరమ్మ క్యాంటీన్ లను కూడా ప్రారంభించామని తెలిపారు. ఇప్పటి నుంచి ఇందిరమ్మ క్యాంటీన్ లలో రూ.5కే అల్పాహారం కూడా అందిస్తామన్నారు.
తర్వాత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. పేదలకు, అల్పాదాయ వర్గాలకు ఇందిరమ్మ క్యాంటీన్ లు ఎంతో ప్రయోజనకరమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో త్వరలో 150 ఇందిరమ్మ క్యాంటీన్ లు ప్రారంభించబోతున్నామని తెలిపారు. మహిళలను ప్రోత్సహిస్తూ స్వయం సహాయక సంఘాలకు (SHG) క్యాంటీన్ లు కేటాయిస్తామని చెప్పారు. అనతరం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మింట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ అందరికీ చేరువగా ఉందన్నారు. పేదలు, అల్పదాయ వర్గాలకు ప్రయోజనకారిగా ఉందన్నారు. అలాగే ఇందిరమ్మ క్యాంటీన్ ల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.