
కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సెక్రటేరియట్ అసిస్టెంట్ పరీక్షల్లో హైటెక్ చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కన్నూర్‌లోని పయ్యంబలం గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఆదివారం (సెప్టెంబర్ 28) మధ్యాహ్నం జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) పరీక్షలో ఓ అభ్యర్ధి బటన్ కెమెరాతో చీటింగ్‌కు పాల్పడ్డాడు. నిందితుడిని కన్నూర్‌లోని పెరలసెర్రీకి చెందిన ఎన్పీ మహ్మద్ సహద్ (27)గా గుర్తించారు. నిందితుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి బటన్ కెమెరా, బ్లూటూత్ ఉపయోగించి బయటి వ్యక్తుల ద్వారా లైవ్‌లో సమాధానాలు తెలుసుకుని సమాధానాలు గుర్తించాడు.
ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష జరుగుతున్న సమయంలో సహద్ ప్రవర్తన అనుమానంగా కనిపించింది. దీంతో పీఎస్సీ విజిలెన్స్ స్క్వాడ్ తనిఖీ చేయగా అసలు యవ్వారం బయటపడింది. దీంతో సహద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. సహద్ తన చొక్కా కాలర్ దగ్గర ఒక చిన్న కెమెరాను అమర్చాడని, తన వద్ద రహస్యంగా దాచిన మొబైల్ ఫోన్‌కు అనుసంధానించబడిన బ్లూ టూత్ ద్వారా సమాధానాలను తెలుసుకుని పరీక్ష రాసినట్లు పోలీసులు తెలిపారు. సహద్‌ను పోలీసులు సాద్‌ను అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు, సహద్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ కన్నూర్ పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీజిత్ కోడేరి నేతృత్వంలోని పోలీసు బృందం వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్, కెమెరా, ఇయర్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బయటి నుంచి సమాధానాలు అందిస్తున్న నిందితుడి స్నేహితుడిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
అలాగే సహద్ గతంలో రాసిన అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆగస్టు 30న సహద్ రాసిన ఎస్ఐ పరీక్ష సహా మరో 4 పరీక్షల్లో కూడా అతడు ఛీటింగ్‌కు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో సహద్ దోషిగా తేలితే పీఎస్సీ పరీక్షలు రాయకుండా అతడిని పదేళ్ల పాటు డీబార్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే అతడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. కాగా కేరళలో బటన్ కెమెరాతో ఇలా హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడటం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ కేరళలో జరిగిన ఇస్రో ఉద్యోగాల నియామక పరీక్షలో ప్రత్యేకంగా తయారుచేసిన కెమెరాలతో ప్రశ్నలకు సమాధానాలు రాస్తూ చీటింగ్‌కు పాల్పడ్డారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.