‘ఒకటో నంబర్ కుర్రాడు’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నందమూరి తారకరత్న. ఎన్నో సినిమాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించారు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ అదరగొట్టాడీ నందమూరి హీరో. అమరావతి సినిమాలో తారకరత్న విలనిజానికి ఏకంగా నంది అవార్డు కూడా వచ్చింది. తాత ఎన్టీఆర్ లాగే సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలనకున్న తారకతర్న ఊహించని విధంగా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న అతను గుండెపోటుకు గురయ్యాడు. సుమారు 23 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత 2023 ఫిబ్రవరి 18 శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచాడు. తారకరత్న మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని భార్య అలేఖ్యా రెడ్డి ఇప్పటికీ ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతోంది. నిత్యం తారకరత్న తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతోంది. తాజాగా మహాలయ అమావాస్య సందర్భంగా తన ముగ్గురు పిల్లలతో కలిసి తారకరత్నకు నివాళులర్పించింది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ అయ్యింది.
‘నా మనసులో భరించలేని బాధ ఉంది. అది ఎప్పటికీ మానిపోని గాయమని తెలుసు. నీ కళ్లు శాశ్వతంగా మూసుకున్న తర్వాతే నీ కోరిక నెరవేరింది. అదే క్షణంలో మిగతావన్నీ కూడా నీతో పాటే వెళ్లిపోయాయి. ప్రస్తుతం నాకు బాధ కలిగించే రోజుల్లో.. నీ కథను తిరిగి వ్రాయడానికి చాలా ఆసక్తిగా ఉన్న ప్రపంచంలో ప్రయాణిస్తున్నా. కాలం గడిచే కొద్దీ నిన్ను మరింతగా మిస్ అవుతున్నా. కొన్ని రోజుల పాటు ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా అనిపించించింది. దుఃఖం నా గొంతును చుట్టుకున్నట్లు, నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా.. అయినప్పటికీ నేను ఆశను వదులుకోను.. ఎందుకంటే నీ గుండె చప్పుడు ఇప్పటికీ నాలో బతికే ఉంది. అది ఎన్నటికీ నిన్ను గుర్తు చేస్తుంది’ అంటే తన భర్తపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది తారకరత్న. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నందమూరి అభిమానులు అలేఖ్యా రెడ్డికి ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.