జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా వార్ 2. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన వార్ 2 సూపర్ హిట్ గా నిలిచింది. అభిమానుల అంచనాలు అందుకోలేనప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తారక్ , హృతిక్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన వార్ 2 సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. త్వరలో వీరి నిరీక్షణకు తెరపడనుంది. వార్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజయ్యాక 8 వారాల తర్వాతే వార్ 2 సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ముందుగానే డీల్ జరిగిందని టాక్. అందులో భాగంగానే ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు. అయితే ఇప్పుడు 8 వారాల గడువు పూర్తయిందని త్వరలోనే వార్ 2 సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. దసరా పండగ కానుకగా అక్టోబర్ 01 నుంచి ఎన్టీఆర్, హృతిక్ ల మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి రానుందని తెలుస్తోంది. ఒక వేళ ఈ డేట్ కు రాకపోయినా అక్టోబర్ 9 నుంచి వార్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. ఒకే రోజు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమా ఓటీటీలోకి రానుందని టాక్. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా వార్ 2 సినిమాను నిర్మించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో భారీ తారాగణమే ఉంది. అశోతోష్ రాణా, అనిల్ కపూర్, వరుణ్ బందోలా, విజయ్ విక్రమ్ సింగ్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. అలాగే టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్, బాబీ డియోలో క్యామియో రోల్స్ లో మెరిశారు. ప్రీతమ్ స్వరాలు అందించారు.