Asia Cup 2025 : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర నిరాశలో కనిపించారు. సరిగా మాట్లాడలేక, తడబడుతూనే ఆయన ఈ ఓటమికి జట్టు తప్పు కాదని, మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా విమర్శించారు. పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం, కోచింగ్ లోపాలపై అక్తర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలవ్వడంపై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాకిస్థాన్ జట్టు ఓటమికి మేనేజ్‌మెంట్ వైఫల్యమే కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. తన స్వభావానికి విరుద్ధంగా, మ్యాచ్ తర్వాత అక్తర్ చాలా నిరాశగా, ఆవేదనతో కనిపించారు. సరిగా మాట్లాడలేక, మాటలు తడబడుతూనే ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫఖర్ జమాన్ (46) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కానీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలం కావడంతో జట్టు 146 పరుగులకే కుప్పకూలింది. దీనిపై స్పందించిన అక్తర్.. దురదృష్టవశాత్తు ఇది పాకిస్థాన్ జట్టు సమస్య కాదు. మిడిల్ ఆర్డర్ ఇబ్బందులు మేనేజ్‌మెంట్ చేసిన తప్పిదం. వారు సరైన ఆటగాళ్లను జట్టులో చేర్చలేకపోతున్నారని అన్నారు.
భారత్ బ్యాటింగ్ ఆరంభంలోనే 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్నప్పటికీ, తిలక్ వర్మ (69) అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి సంజు శాంసన్ (24) మరియు శివమ్ దూబే (33) చక్కటి సహకారం అందించడంతో భారత్ విజయం సాధించింది. షోయబ్ అక్తర్ పాకిస్థాన్ ఓటమికి ప్రధానంగా మేనేజ్‌మెంట్‌ను నిందించారు. ఆయన మాట్లాడుతూ…”దీనిని సెన్స్‌లెస్ కోచింగ్ అని పిలవడానికి క్షమించండి, కానీ ఇది నిజంగా సెన్స్‌లెస్ కోచింగ్. మా మ్యాచ్ విన్నర్లు అయిన సల్మాన్ మీర్జా, హసన్ నవాజ్ వంటి వారికి ఇది చాలా కష్టమైంది. మేము చాలా నిరాశ చెందాం” అని తీవ్ర పదజాలంతో విమర్శించారు.
షోయబ్ అక్తర్ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా, ధైర్యంగా చెబుతారు. అయితే, ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్ ఓటమి తర్వాత ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సరిగా మాట్లాడలేక, ఆయన గొంతు తడబడింది. ఒక మాట మధ్యలో ఆపి, మరో మాట మొదలుపెట్టారు. “ఇది సూపర్ సండే దేశమంతా మ్యాచ్ చూస్తోంది. మా మిడిల్ ఆర్డర్‌లో ముందు నుంచే సమస్యలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, అందరూ అదే అంటున్నారు” అని ఆయన అన్నారు. పాకిస్థాన్ క్రికెట్‌లో చాలా కాలంగా మిడిల్ ఆర్డర్ సమస్య కొనసాగుతోందని, అయితే దానిని పరిష్కరించడానికి మేనేజ్‌మెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన పరోక్షంగా విమర్శించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..