Asia Cup Trophy Controversy: టీమిండియాకు కప్ ఎప్పుడు ఇస్తారు? మొహసిన్ నఖ్వీకి బీసీసీఐ అల్టిమేటం

Asia Cup Trophy Controversy: టీమిండియాకు కప్ ఎప్పుడు ఇస్తారు? మొహసిన్ నఖ్వీకి బీసీసీఐ అల్టిమేటం


Asia Cup Trophy Controversy: పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది. అయినా ఇప్పటికీ విజేతలకు దక్కాల్సిన ట్రోఫీ మాత్రం దక్కలేదు. దీనికి కారణం భారత జట్టు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడమే. నిబంధనల ప్రకారం, విజేతకు ట్రోఫీ అందించే మొదటి అధికారం ఏసీసీ చీఫ్‌కే ఉంటుంది. అయితే, మొహసిన్ నఖ్వీ ఏసీసీ అధ్యక్షుడితో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్‌గా, అంతకంటే ముఖ్యంగా పాకిస్థాన్ ప్రభుత్వంలో హోం మంత్రిగా కూడా ఉన్నారు. ఇరు దేశాల సంబంధాలు సరిగా లేని సమయంలో, ఒక పాకిస్థాన్ మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ఇష్టపడలేదు. ఈ మొత్తం వివాదంపై ఇప్పుడు బీసీసీఐ సీరియస్ యాక్షన్‌కు సిద్ధమవుతోంది.

పాకిస్థాన్‌ను ఓడించి ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత కూడా టీమ్ ఇండియాకు ట్రోఫీ దక్కకపోవడం క్రికెట్ ప్రపంచంలో పెద్ద వివాదానికి దారితీసింది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించడంతో ఈ సమస్య మొదలైంది.

మొహసిన్ నఖ్వీ చేత ట్రోఫీ ఇప్పించకుండా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ద్వారా ఇప్పించాలని బీసీసీఐ కోరింది. అయితే, ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ అందుకు బదులుగా ట్రోఫీని తీసుకుని తన హోటల్‌కు వెళ్లిపోవడం బీసీసీఐకి మరింత ఆగ్రహం తెప్పించింది. ఆసియా కప్ టోర్నమెంట్‌కు అత్యంత బాధ్యత వహించాల్సిన వ్యక్తిగా ఉండి కూడా నఖ్వీ వ్యవహరించిన తీరును బీసీసీఐ జీర్ణించుకోలేకపోయింది.

మొహసిన్ నఖ్వీ ఈ వైఖరిపై బీసీసీఐ ఇప్పుడు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మొదట మొహసిన్ నఖ్వీకి తన తప్పును సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఆసియా కప్ ట్రోఫీని భారత జట్టుకు త్వరగా తిరిగి ఇవ్వాలని తాము ఆశిస్తున్నామని సైకియా అన్నారు.

అయితే, ఒకవేళ నఖ్వీ అలా చేయడంలో విఫలమైతే బీసీసీఐ దీనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. దేవజిత్ సైకియా ప్రకారం.. ఈ వివాదంపై నవంబర్‌లో దుబాయ్‌లో జరగబోయే ఐసీసీ సమావేశంలో బీసీసీఐ తన నిరసనను తెలియజేయవచ్చు.. అధికారికంగా ఫిర్యాదు చేయవచ్చు. అంటే, మొహసిన్ నఖ్వీకి భారత జట్టుకు ట్రోఫీని తిరిగి ఇవ్వడానికి అక్టోబర్ చివరి వరకు మాత్రమే సమయం ఉందని అర్థం.

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా, పాక్ జట్టు 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. జవాబుగా భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని 20వ ఓవర్‌లోనే 5 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *