Suryakumar Yadav : ఆసియా కప్ 2025 టైటిల్‌ను గెలిచిన వెంటనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రకటించి, అందరి మనసులను గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల నుండి వచ్చిన తన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ట్రోఫీ ఇవ్వని ఏసీసీ పై తీవ్ర అసంతృప్తి
దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కష్టపడి గెలిచిన ఛాంపియన్‌లకు ట్రోఫీ ఇవ్వకుండా నిరాకరించడంపై ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)పై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. “నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుండి, కష్టపడి గెలిచిన జట్టుకు ట్రోఫీని నిరాకరించడం ఎప్పుడూ చూడలేదు” అని సూర్యకుమార్ అన్నారు. టోర్నమెంట్ అంతటా భారత్ అజేయంగా నిలిచింది, పాకిస్థాన్‌ను మూడుసార్లు ఓడించింది. అయినప్పటికీ, ట్రోఫీ ప్రెజెంటేషన్ లేకపోవడం విజయ సంబరాల మధ్య కాస్త బాధ కలిగించింది.
‘నా సహచరులే నిజమైన ట్రోఫీ’
“నాకు నిజమైన ట్రోఫీలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాయి. నా 14 మంది సహచరులు, సపోర్ట్ స్టాఫ్. ఈ టైటిల్ గెలవడానికి వారే కారణం. అయినప్పటికీ, కష్టపడి ఆడిన టోర్నమెంట్‌లో గెలిచిన జట్టుకు ట్రోఫీ లభించకపోవడం నేను ఎప్పుడూ చూడలేదు” అని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
కెప్టెన్సీ, వ్యక్తిగత ఫామ్‌పై స్పందన
మైదానం వెలుపల జరిగిన వివాదాలు తన కెప్టెన్సీని ప్రభావితం చేయలేదని భారత కెప్టెన్ అన్నారు. “ఆటగాళ్లు దానిని సానుకూలంగా తీసుకున్నారు. టోర్నమెంట్ అంతా బాగా సాగింది. మొదటి రోజు నుండే వారికి క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టమని చెప్పాను. ప్రాక్టీస్ సెషన్స్‌ను ఆస్వాదిస్తూ, మ్యాచ్‌లో చేయాలనుకునే పనులనే చేయమని సూచించాను.”
తన బ్యాటింగ్ ఫామ్ గురించి వస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ సూర్యకుమార్.. “నేను ఫామ్ కోల్పోలేదు. నాకు పరుగులు మాత్రమే రావడం లేదు. నేను నా సన్నద్ధతను నమ్ముతాను. దేవుడు చూస్తున్నాడు. మనం బాగా చేస్తూ ఉంటే, ప్రతిదీ సరైన సమయానికి వస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
భారత సైన్యానికి మ్యాచ్ ఫీజు విరాళం
తన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు.. “ఒక గౌరవ సూచకంగా, ఈ టోర్నమెంట్‌లో నేను ఆడిన అన్ని ఆటల నుండి నా మ్యాచ్ ఫీజులను ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను. ప్రజలు దీనిని వివాదాస్పదం అని పిలుస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాకు, ఇది సరైన పని” అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..