ప్రశాంతమైన గోదావరి తీరంలో ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మవారు తన బిడ్డతో కలిసి కొలువై ఉన్నారు. తల్లి బిడ్డలు శిరస్సు భాగాలతో మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తారు. తమపై ఎండా, వానా పడేట్టు ఆలయం నిర్మించమని ఆ గ్రామ పెద్దల స్వప్నంలో కనిపించి ఆజ్ఞాపించారట. అందుకే అలా నిర్మాణం చేశారు. ఇంతటి విశిష్టమైన ఆలయం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లంలో ఉంది. అదే మాచేనమ్మ దేవస్థానం. గోదావరి తీరాన ఉన్న మాచేనమ్మ దేవస్థానానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఇక్కడ దాదాపు అయిదడుగుల లోతు బావిలో బిడ్డతో సహా అమ్మవారి శిలా విగ్రహం ఉంటుంది. గోపురం స్థానంలో ఎండ, వాన పడేలా ఖాళీలు వదిలి.. తాటాకుల కప్పు మాత్రమే ఆలయానికి ఉంటుంది.
దాదాపు 400 ఏళ్ల క్రితం పెదమల్లం ఆడపడుచు మాచేనమ్మ భర్త కారణంగా అవమానాన్ని ఎదుర్కొంది. ఆ అవమానాన్ని భరించలేక బిడ్డతో సహా బావిలో దూకి భూమాతలో ఐక్యమయ్యారు. వెంటనే తప్పు తెలుసుకున్న భర్త వారిని పైకి లాగేందుకు యత్నించగా దేవతా శిలలుగా మారిపోయారు. గ్రామస్తులు విగ్రహాలను పైకి తీసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గ్రామస్థులు అంతా కలిసి అక్కడే ఆలయ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. నిర్మాణానికి పూనుకున్న సమయంలో అమ్మవారు గ్రామ పెద్దలకు స్వప్నంలో సాక్షాత్కరించి చేసిన విగ్రహాలపై ఎండ, వాన పడేలా ఖాళీలు వదిలి పెట్టాలని ఆదేశించిందట. అమ్మవారి ఆన ప్రకారం తాటాకుల పాక ఏర్పాటు చేశారు. వందల ఏళ్లుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ అన్ని హంగులతో ఆలయాన్ని నిర్మించినా గోపురం స్థానంలో తాటాకుల కప్పు వేశారు. దీంతో బావిలోని విగ్రహాలపై ఎండా, వానా పడేట్టు ఉంటుంది. మాచేనమ్మను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల నుంచి ప్రతి ఆదివారం ఇక్కడికి భక్తులు తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.