
రాజధాని అమరావతిలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. గతంలోనే రాజధానిలో అతి పెద్దదైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి భారీ ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటు అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలోని కొండపై అతి పెద్దదైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం టెండర్లు పిలిచింది. నీరుకొండలోని కొండపై 300 అడుగుల ఎత్తున్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. వంద అడుగుల ఎత్తులో పాద పీఠం ఏర్పాటు చేసి ఆ పైన రెండు వందల అడుగుల ఎత్తులో విగ్రహాన్ని నిర్మించనున్నట్లు టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాజధానిలో ఏ ప్రాంతం నుంచి చూసిన విగ్రహం కనిపించేలా నిర్మాణం ఉండబోతున్నట్లు తెలుస్తుంది. పాదపీఠంలో మిని థియేటర్, కన్వెన్షన్ సెంటర్‌తో పాటు మ్యూజియం కూడా ఏర్పాటు చేయనున్నారు.
రాజధానిలో ఇప్పటికే పలువురి భారీ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక వైపు అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శాఖమూరు సమీపంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. విగ్రహాంతో పాటు పార్క్, లైబ్రరీ వంటి వాటిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తుళ్లూరు మండలం నెక్కల్లు సమీపంలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నిర్మాణానికి శంఖు స్థాపన జరిగింది. పొట్టి శ్రీరాములు ట్రస్ట్ పర్యవేక్షణలో విగ్రహాన్ని నిర్మించనున్నారు. రాజధానిలో ప్రముఖులు భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తుండటంతో ఇవన్నీ కూడా దర్శనీయ స్థలాలుగా మారిపోతాయని స్థానికులు భావిస్తున్నారు. ప్రముఖులు చరిత్ర తెలుసుకోవడమే కాకుండా వారి విగ్రహాలు పర్యాటక కేంద్రాలుగా కూడా మారనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.