గత ఐదు రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జ్వరం తీవ్రత లేదని, దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోందని పవన్ కల్యాణ్ సీఎంకు తెలిపారు. పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకైటిస్ మూలంగా దగ్గు ఎక్కువగా వస్తోందని, ఫలితంగానే గొంతు దగ్గర నొప్పి కూడా ఉందని వైద్యులు చెప్పినట్లు వివరించారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామకపత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించి యువతలో మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని ముఖ్యమంత్రివర్యులకు కృతఙ్ఞతలు తెలిపారు.
అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ కార్యక్రమంపై చర్చించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని విజయవంతంగా అమలు చేయగలిగామని, తద్వారా మహిళలకు ఆర్థికపరమైన వెసులుబాటు కలుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం మూలంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక భరోసాను కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని, 4 వ తేదీన విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు.
మరోవైపు అక్టోబర్ 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై సీఎం, డిప్యూటీ సీఎం చర్చించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని నిర్ణయించారు. జి.ఎస్.టి. సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న రోడ్ షో నిర్వహణ, అందుకు సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.