IND vs PAK Final : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్థాన్‌ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ హై-వోల్టేజ్ పోరుకు ముందు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా తన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో తీవ్ర స్థాయిలో స్పందించాడు. ఇటీవలే చెలరేగిన హ్యాండ్‌షేక్ వివాదంపై ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించడమే కాకుండా, తమ జట్టుకు తగిన విధంగా స్పందించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని అన్నాడు. గత రెండు మ్యాచ్‌లలో భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్, ఈసారి మాత్రం ఒత్తిడికి లోనవకుండా బలంగా పుంజుకోవాలని చూస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లలో ఎప్పుడూ భావోద్వేగాలు క్రికెట్‌కు అతీతంగా ఉంటాయని సల్మాన్ ఆగా అన్నారు. అయితే, క్రీడాస్ఫూర్తిని కొనసాగించడం కూడా అంతే ముఖ్యమని నొక్కి చెప్పారు. తాను 2007లో అండర్-16 క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుండి కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు అంత మంచిగా లేవని గుర్తుచేశారు. అయినప్పటికీ, ఆటగాళ్లు ఎప్పుడూ చేతులు కలిపారని అన్నారు. “ఏ జట్టు కూడా ఉద్దేశపూర్వకంగా చేతులు కలపకుండా ఉన్నట్లు నేను ఎప్పుడూ చూడలేదు. ఫైనల్లో కూడా మా జట్టు కచ్చితంగా స్పందిస్తుంది, కానీ మర్యాద హద్దుల్లోనే ఉంటుంది” అని సల్మాన్ ఆగా టీమిండియాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.
భారత్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్, సూపర్-4 రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన పాకిస్థాన్ జట్టు ఫైనల్లో ఒత్తిడికి లోనవకుండా ఆడాలని కోరుకుంటోంది. సల్మాన్ ఆగా మాట్లాడుతూ తమ జట్టు గత మ్యాచ్‌లలో తప్పులు చేసిందని, అందుకే ఓడిపోవలసి వచ్చిందని అంగీకరించాడు. “ఫైనల్లో రెండు జట్లపై సమానమైన ఒత్తిడి ఉంటుంది. భారత మీడియా మమ్మల్ని ఏమీ చేయదు. మేము కేవలం మా తప్పులను సరిదిద్దుకోవాలి” అని ఆయన అన్నారు.
సల్మాన్ తనను తాను విమర్శించుకోవడానికి కూడా వెనుకాడలేదు. తన స్ట్రైక్ రేట్ ఆశించిన స్థాయిలో లేదని అంగీకరించాడు. “ప్రతిసారి 150 స్ట్రైక్ రేట్‌తో ఆడటం అవసరం లేదు. పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే ముఖ్యం. జట్టుకు ప్రయోజనం చేకూర్చడానికి నేను ఇంకా మంచి ప్రదర్శన చేయాలి” అని ఆయన అన్నారు.
భారత్, పాకిస్థాన్ మొదటిసారిగా ఆసియా కప్ ఫైనల్లో తలపడనున్నాయి. భారత్ ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు పాకిస్థాన్‌ను రెండుసార్లు ఓడించింది. దీంతో పాకిస్థాన్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయితే, కెప్టెన్ ఆగా వ్యాఖ్యలను బట్టి చూస్తే, అతని జట్టు మైదానంలో బలంగా పుంజుకోవాలని నిర్ణయించుకుంది. ఇది ఫైనల్‌కు ముందు ఉత్కంఠను మరింత పెంచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..